KTR | హైదరాబాద్/నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఇన్నేండ్లు ప్రజాజీవితంలో ఉంటూ కాపాడుకున్న తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్ బుధవారం ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. సుమారు అర్ధగంటపాటు కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకున్నది. మంత్రి మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు, పార్టీ ప్రతిష్ఠకు గండికొట్టాలనే ఉద్దేశంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆమె తనపై, సాటి మహిళ సమంత మీద ఎలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిందో.. తన నోటితో కోర్టులో చెప్పలేననని అన్నారు. బహిరంగంగా (ఓపెన్ కోర్టులో) అసభ్య పదజాలాన్ని చదవడం మంచిదికాదని, ఆమె చేసిన వ్యాఖ్యలను పిటిషన్లో పేర్కొన్నట్టు విన్నవించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి, ప్రజలకు సేవలందిస్తునట్టు తెలిపారు. తాను ఉన్నత విద్యావంతుడినని, అమెరికాలో, భారత్‌లో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేశానని చెప్పారు. 2006లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న సమయంలో నెలకు రూ.4 లక్షల వేతనం సంపాదిస్తున్నప్పటికీ ఉద్యోగానికి రాజీనామాచేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించానని, ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలందించడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకు అవార్డులు లభించాయని కేటీఆర్ తెలిపారు. 18 సంవత్సరాలపాటు ప్రజలతో మమేకమై మచ్చలేకుండా రాష్ట్ర ప్రజల ప్రశంసలు పొందానని చెప్పారు. తాను అందించిన సేవలకు గుర్తింపుగా మీడియా సంస్థలు సైతం ‘యంగ్ పొలిటీషియన్’ అవార్డుతో సత్కరించాయని వెల్లడించారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా ప్రజల మధ్య తనకు మంచి పేరు, ప్రతిష్ఠలున్నాయని వివరించారు.
మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కావాలని తనపై నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ చెప్పారు. ఆ వ్యాఖ్యలు టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియాలో ప్రసారం అయ్యాయని, ఆ వార్తా కథనాల ద్వారా సాక్షులుగా ఉన్నవారు తీవ్ర కలత చెందారని తెలిపారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారితో 18 సంవత్సరాలుగా తనకు పరిచయం ఉన్నదని, తన గురించి, గౌరవ మర్యాదల గురించి వారికి తెలుసు అని పేర్కొన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తన పరువుకు భంగం వాటిల్లిందని అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏమిటి? వాటి గురించి వివరాలు చెప్పగలరా? అని జడ్జి ప్రశ్నించారు. మహిళల పట్ల తనకెంతో గౌరవం ఉన్నదని, కొండా సురేఖ సాటి మహిళ సమంతతోపాటు తనపై చేసిన అతినీచమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలను పవిత్రమైన కోర్టులో తన నోటితో చెప్పలేనని అన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ఉద్దేశపూర్వకంగా నిందలు వేశారని, ఈ దుశ్చర్యలను తీవ్రంగా పరిగణించి చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. టీవీల్లో, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో, డిజిజల్ మీడియాలో వచ్చిన వార్తాకథనాలకు సంబంధించిన క్లిప్పింగులను ఫిర్యాదు పత్రానికి జోడించినట్టు వివరించారు.
నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలం సమర్పించి బయటకు వస్తున్న కేటీఆర్
ఈ కేసులో సాక్షిగా ఉన్న దాసోజు శ్రవణ్‌కుమార్ స్టేట్మెంట్ను కోర్టు నమోదు చేసింది. 2007 నుంచి కేటీఆర్‌తోనే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నానని శ్రవణ్ తెలిపారు. అక్టోబర్ 2న టీవీల్లో వచ్చిన వార్తలను చూసి బాధకు గురయ్యానని, మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని తెలిపారు. అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు కేటీఆర్‌పై గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని, టీవీల్లో వచ్చిన వార్తల గురించి తాను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఆమె మీడియాలో చేసిన ప్రసంగం బాధ పెట్టిందని పేర్కొన్నారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. మిగతా ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలను కోర్టు ఆ రోజు నమోదు చేయనున్నది.
రాజకీయాల్లో దిగజారుడు మాటలు మాట్లాడవద్దని, కుటుంబాలను కించపరిచే వ్యాఖ్యలు చేయవద్దని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ సూచించారు. నాంపల్లి కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సారీ చెప్తే చెలామణి అవుతుందని అనుకోవద్దని, న్యాయం, ధర్మం గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. భవిష్యత్తులో రేవంత్‌రెడ్డి, కొండా సురేఖ, బండి సంజయ్ లాంటివారు ఏది పడితే అది మాట్లాడితే కుదరదని హెచ్చరించారు.
నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన అనంతరం కేటీఆర్ అక్కడే కాసేపు ఉన్నారు. కోర్టు క్యాంటీన్లో ఉస్మానియా బిసెట్లు, ఇరానీ చాయ్ టేస్ట్ చేశారు. తిరిగి వచ్చే క్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ నేతల ఆహ్వానం మేరకు నాంపల్లిలో పలు షాప్‌లకు వెళ్లి సందడి చేశారు. అభిమాన నేత తమ వద్దకు రావడంతో పలువురు సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ఉన్నారు.
మహిళా మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని పెంచేలా ఉండాలి తప్ప భంగం కలిగించేలా ఉండకూడదని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. ఆమె హోదాకు, పదవికి, వయస్సుకు అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు తగవని హితవుపలికారు. కోర్టు తీర్పు ఇలా దారుణంగా మాట్లాడేవారికి గుణపాఠంగా ఉండాలని పేర్కొన్నారు. అప్పుడే ఎవ్వరైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడతారని అన్నారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు కేటీఆర్ వెంటవచ్చిన మాజీమంత్రి అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో తాను సాక్ష్యం చెప్పేందుకు వచ్చానని తెలిపారు. సమయాభావం వల్ల తన వాంగ్మూలం ఇవ్వలేకపోయానని 30వ తేదీన తనతోపాటు ముగ్గురు వాంగ్మూలం ఇస్తారని చెప్పారు.
ఈ కేసులో నలుగురు సాక్షులుండగా సమయాభావం వల్ల కోర్టు ఒక్క దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్ను మాత్రమే రికార్డు చేసిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు లలితారెడ్డి చెప్పారు. కోర్టు బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిగతా ముగ్గురు సత్యవతి రాథోడ్, తుల ఉమ, బాల్క సుమన్ వాంగ్మూలాన్ని ఈ నెల 30న కోర్టు తీసుకుంటుందని చెప్పారు. వివిధ చానళ్లలో ప్రసారమైన కొండా సురేఖ వ్యాఖ్యలు సహా మొత్తం తొమ్మిది ఆధారాలను కోర్టుకు సమర్పించినట్టు తెలిపారు. ఇకపై కేటీఆర్‌పై ఎలాంటి వ్యతిరేక కామెంట్లు చేయవద్దని కోర్టు ఇన్‌జంక్షన్ ఆర్డరు ఇచ్చిందని తెలిపారు.
గతంలోనూ కేటీఆర్‌పై కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పుడు ఎన్నికల సంఘం ఆమె తీరుపై మండిపడింది. అయినప్పటికీ ఆమె మాటతీరులో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ అవే ఆరోపణలు చేయటంతో బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. మంత్రి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసును కేటీఆర్ ఫైల్ చేశారు. ఈ నెల 21నే స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉన్నప్పటికీ కేటీఆర్ అభ్యర్థన మేరకు గురువారం వరకు కోర్టు సమయమిచ్చింది. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణభవన్ నుంచి కేటీఆర్‌సహా ఈ కేసులో సాక్షులుగా ఉన్న దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, బాల సమన్, మాజీ మంత్రి జగదీశ్‌తోపాటు బీఆర్ఎస్ నేతలు నాంపల్లి కోర్టుకు బయలుదేరారు.