నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంంగాణ) : సినీ నటుడు అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణలో భాగంగా గురువారం మంత్రి కొండా సురేఖ కోర్టుకు గైర్హాజరయ్యారు. ఆమె తరఫున దాఖలు చేసిన గైర్హాజరు పిటిషన్‌ను అంగీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణను వచ్చేనెల 6కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 6లోగా కోర్టుకు మంత్రి సురేఖ జమానత్‌లు సమర్పించాలని ఆదేశించింది.
జమానత్‌లు సమర్పించని పక్షంలో జరిమానా విధించనున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నది. ఇరువర్గాల తరఫున న్యాయవాదులు గైర్హాజరు పిటిషన్లను దాఖలు చేశారు. నిరుడు లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోర్టుకు సమర్పించిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని ఆమెపై విచారణ చేపట్టనున్నది.
అక్కినేని నాగార్జున కోర్టుకిచ్చిన వాంగ్మూలంతోపాటు యార్లగడ్డ సుప్రియ సాక్ష్యాన్ని కోర్టు రికార్డు చేసింది. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతపై ఆమె చేసిన ప్రసంగాన్ని ప్రముఖ టీవీ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలను పెన్‌డ్రైవ్‌లో నిక్షిప్తం చేసి కోర్టుకు సమర్పించారు. పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను దాఖలు చేశారు. సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ కొనసాగిస్తున్నది.