Regional Ring Road | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి టెండర్లు పిలిచి 8 నెలలు గడుస్తున్నా ఆ ప్రాజెక్టుపై పడిన పీటముడి వీడటంలేదు. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ట్రిపుల్‌ఆర్‌పై త్వరలో స్పష్టత వస్తుందని చెప్తూనే వచ్చే వారం ప్రధానిని కలుస్తానని ప్రకటించడం సందేహాలకు తావిస్తున్నది. పార్లమెంటరీ హౌస్ ప్యానల్ సిఫారసుల ప్రకారం భూసేకరణ పూర్తికాని ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వరాదని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. సుమారు 162 కిలోమీటర్ల పొడవైన ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి దాదాపు 1,950 హెక్టార్ల భూమి అవసరం కాగా.. అందులో 90% భూములకు అవార్డులు పాస్ చేసినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. కానీ, గతంలో భూములిచ్చేందుకు ఒప్పుకున్న అనేక మంది రైతులు కాలక్రమంలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఇప్పుడు తమ భూములను ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయమై ఇప్పటికే పలువురు రైతులు కోర్టును ఆశ్రయించగా.. మరికొందరు ఆర్బిట్రేషన్‌కు దరఖాస్తు చేస్తున్నారు.
ట్రిపుల్ఆర్ను తొలుత 4 లేన్లతో నిర్మించేందుకు అలైన్‌మెంట్‌ను సిద్ధంచేసి గత డిసెంబర్లో టెండర్లు పిలిచిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ).. ఇప్పుడు పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా 6 లేన్లతో నిర్మించాలని నిర్ణయించడంతో టెండర్ల ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. భూసేకరణ పూర్తికాకుండా రహదారుల నిర్మాణ పనులు చేపట్టరాదని ఇటీవల పార్లమెంటరీ హౌస్ ప్యానల్ సిఫారసు చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో అటవీ, రైల్వే తదితర శాఖల నుంచి అనుమతులు లేకపోవడంవల్ల పలు జాతీయ రహదారుల నిర్మాణ పనులు ఏండ్ల తరబడి సాగుతున్నాయని, చాలాచోట్ల భూసేకరణకు రైతులు ఒప్పుకోకపోవడం, కోర్టు కేసుల వల్ల మితిమీరిన జాప్యం జరుగుతున్నదని హౌస్ ప్యానల్ గుర్తించింది. దీంతో భూసేకరణ పూర్తయి, అన్ని అనుమతులు వచ్చాకే రహదారి ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఆర్ ప్రాజెక్టుకు ఇంకా భూసేకరణ పూర్తికాకపోవడం వల్ల ఎన్హెచ్ఏఐ ఆచితూచి అడుగులు వేస్తున్నదని, అందుకే ఇప్పటివరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం రాలేదని తెలుస్తున్నది.
ప్రధానిని కలిస్తే క్యాబినెట్ ఆమోదం వస్తుందని..
రాష్ట్రంలోని వివిధ రోడ్డు ప్రాజెక్టుల విషయమై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 5న ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిశారు. ఆ తర్వాత రాష్ట్రంలో రోడ్డు ప్రాజెక్టులపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీతో 7న సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ఆర్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం రావాల్సి ఉన్నదని, దీనిపై వచ్చే వారం ప్రధాని నరేంద్రమోదీని కలుస్తానని ప్రకటించారు. మారిన అలైన్‌మెంట్‌ను పంపితే వెంటనే ఆమోదిస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి చెప్తూనే.. మోదీని కలుస్తానని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదు. భూసేకరణ పూర్తికాకుండా ట్రిపుల్‌ఆర్‌పై ముందడుగు పడే అవకాశం లేదని గడ్కరీతో భేటీ సందర్భంగా స్పష్టత వచ్చిందని, అందుకే ప్రధానిని కలిసి దీనిపై చర్చించాలని మంత్రి కోమటిరెడ్డి నిర్ణయించుకున్నారని సమాచారం.
నష్టపరిహారం తేలకుండా ఎలా?
ట్రిపుల్ఆర్ ఉత్తరభాగం కోసం సేకరించిన భూములు, ఇతర ఆస్తులకు పరిహారం కింద రూ.5,100 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 1,250 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ పరిహారానికి రైతులు ససేమిరా అంటున్నారు. ఎకరా రూ.50 లక్షలకుపైగా ధర పలుకుతున్న భూములను రూ.12 లక్షలకు ఎలా ఇవ్వాలని నిలదీస్తున్నారు. ఎన్టీపీసీ కోసం గతం లో భూములు సేకరించినప్పుడు ఎకరాకు రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొ ంటూ.. ట్రిపుల్ఆర్కు అదే విధంగా పరిహారం ఇవ్వాలని ఎన్హెచ్ఏఐని కోరింది.