రైతుబంధు ఏదని అడిగిన పాపానికి జిల్లా పరిషత్తు చైర్మన్‌పైనే దాడి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారిక సమావేశంలోనే ఒక క్యాబినెట్ ర్యాంకు ప్రజాప్రతినిధిపై దౌర్జన్యానికి దిగింది.
‘రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా’ అంటూ ఇటీవల మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి సమక్షంలోనే సోమవారం ఈ దాడి జరగడం గమనార్హం. మంత్రి ప్రోద్బలంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. యాదాద్రి జిల్లా పరిషత్తు చైర్మన్ సందీప్‌రెడ్డిని అమర్యాదకరంగా ప్రభుత్వ కార్యక్రమం నుంచి బయటకు గెంటేశారు. కోమటిరెడ్డి ఉసిగొల్పడంతో కాంగ్రెస్ కార్యకర్తలూ రెచ్చిపోయారు. సందీప్‌రెడ్డిని నెట్టివేస్తూ దాడికి పాల్పడ్డారు.
అధికారంలోకి వచ్చి 60 రోజులైనా కాలేదు. మంత్రి కోమటిరెడ్డి నోటిదురుసుకు అడ్డూ అదుపూ లేకపోయింది. మంత్రి హోదా సైతం ఆయన మాట తూలుడును ఆపలేకపోయింది. దుర్భాషలాడటం పరిపాటిగా మారింది. రైతుబంధు అడిగితే చెప్పుతోకొడుతానంటూ రైతుల్ని అవమానించారు. చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలివ్వలేమంటూ ఎకసెక్కాలాడారు. బీఆర్ఎస్పైన నోరుపారేసుకున్నారు. ఇటీవల వివిధ సందర్భాల్లో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలివీ..
బీఆర్ఎస్ను 14 ముక్కలు చేస్తం. మేం తలుచుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలను 39 ముక్కలు చేస్తం.
– ఈ నెల 22న భువనగిరి కలెక్టరేట్లో సమీక్ష సందర్భంగా..
రైతుబంధు పెట్టుబడి సాయం ఇంకా రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టండి.
– ఈ నెల 24న గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..
చదువుకున్నోళ్లందరికీ ఉద్యోగాలివ్వలేం. అది సాధ్యం కాదు. అర్హులకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలిస్తాం
– ఈ నెల 25న హాజీపూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా..
Minister Komatireddy | హైదరాబాద్/నల్లగొండ ప్రతినిధి/యాదాద్రి భువనగిరి, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఎవరైనా రెతుబంధు ఇవ్వలేదని అంటే చెప్పుతో కొడతామన్న ఆయన వ్యాఖ్యలు మర్చిపోకముందే మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి ఏకంగా జిల్లాలో అత్యున్నత ప్రొటోకాల్ కలిగిన జడ్పీ చైర్మన్‌నే అవమానపర్చేలా వ్యవహరించారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో అడ్డగోలుగా మాట్లాడడమే కాకుండా అధికార బలంతో జడ్పీ చైర్మన్‌ను పోలీసులతో వేదిక మీది నుంచి నెట్టివేయించారు. జడ్పీ చైర్మన్‌ను అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నా అదే వేదికపై ఉన్న జిల్లా కలెక్టర్, డీసీపీ ప్రేక్షక పాత్ర వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. మంత్రి కోమటిరెడ్డి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత నంబర్ 2గా తననే గుర్తించాలన్న ధోరణితో వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదంగా మారింది.
అసలేం జరిగిందంటే?
సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరులో నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రితోపాటు యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడే సభ నిర్వహించారు. ఈ సభలో ముందుగా ఎమ్మెల్యే, తర్వాత జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి మాట్లాడారు.
‘నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడమే కాకుండా బీఆర్ఎస్పై బురద జల్లడం సరికాదు. రైతుబంధు రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టాలని మంత్రి అనడం సబబు కాదు’ అని సందీప్‌రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మైక్ అందుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
కేటీఆర్‌కు అహంకారమంటూ ‘బచ్చాగాడివి.. రేవంత్‌రెడ్డి కాలిగోటికి కూడా సరిపోవు.. మీ అయ్య అండతో అమెరికా నుంచి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచావ్. మా నాయన ఎమ్మెల్యే కాదు.. రేవంత్‌రెడ్డి నాయన ఎమ్మెల్యే కాదు.. కష్టపడి వచ్చాం. ఎమ్మెల్యేలు అయ్యామ’ని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిని ఉద్దేశిస్తూ అహంకారాన్ని ప్రదర్శించబోయారు.
‘సందీప్‌రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవరెడ్డి పేరు చెబితే జడ్పీటీసీ అయ్యాడు తప్ప.. సర్పంచ్‌కు కూడా పనికిరాడు’ అంటూ ఆయన వైపు చేయి చూపుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో పక్కనే ఉన్న సందీప్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రిగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం తగదంటూ ఆక్షేపించారు. దీంతో సందీప్‌రెడ్డిని ఏయ్ కూర్చో.. అంటూ ఎదురుగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టారు. మంత్రి వెంకట్‌రెడ్డి తీరుపట్ల సందీప్‌రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
అయినా మంత్రి అంతటితో ఆగకుండా ‘ఈయన్ను బయటకు వెళ్లగొట్టండి’ అంటూ పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసు అధికారులు మంత్రికి వత్తాసు పలుకుతూ జడ్పీ చైర్మన్ చెయ్యి పట్టి వేదిక మీది నుంచి నెట్టుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గగా.. మరోసారి మంత్రి ‘బయటకు నెట్టేయండి’ అంటూ అరిచారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు మంత్రి అండతో రెచ్చిపోతూ సందీప్‌రెడ్డి వైపునకు దూసుకొచ్చారు. సందీప్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నెట్టివేసేందుకు యత్నించారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతోపాటు తీవ్ర తోపులాట జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటిస్తూ సందీప్‌రెడ్డికి అండగా నిలిచారు.
పోలీసుల అత్యుత్సాహం..
అధికారిక కార్యక్రమ వేదికపై జిల్లా కలెక్టర్ కే జెండగే, డీసీపీ రాజేశ్చంద్ర కూడా ఉన్నారు. జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిని బయటకు నెట్టివేయండని మంత్రి అనగానే స్థానిక పోలీసులు రెచ్చిపోయారు. జడ్పీ చైర్మన్ చేయి పట్టి ఎస్ఐ, సీఐలు నెట్టివేస్తున్నా జిల్లా అధికారులు చూస్తుండి పోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో అత్యున్నత ప్రొటోకాల్ ఉన్న జడ్పీ చైర్మన్‌ను కార్యక్రమానికి ఆహ్వానించి అవమానించేలా వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మంత్రి ఆదేశాలతో జడ్పీ చైర్మన్‌ను పోలీసులే బయటకు పంపించివేయడం, ఇలా పంపిస్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నెట్టివేయడం, చేయి చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డీసీపీ ముందే స్థానిక పోలీసులు మంత్రి ఆజ్ఞలతో అత్యుత్సాహాన్ని ప్రదర్శించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోమటిరెడ్డీ.. చిల్లర చేష్టలు మానుకో : సందీప్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రైతుబంధు, రుణమాఫీ, పింఛన్లు, కరెంట్ బిల్లులు చెల్లించాలని అడిగితే, వాటిపై సమాధానం చెప్పకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యక్తిగతంగా ఏదేదో మాట్లాడుతున్నారని జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి మండిపడ్డారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్న మంత్రి వ్యాఖ్యలు సరికాదని ఆయన దృష్టికి తీసుకొచ్చానని చెప్పారు. మంత్రి హుందాతనంతో ఉండాలని, ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, ఇలా చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఘటనపై పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.
కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ డిమాండ్
అహంకారంతో అడ్డగోలుగా జడ్పీ చైర్మన్‌పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా కోమటిరెడ్డి ప్రతి ఒకరిపైన నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. మొన్నటికి మొన్న రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టాలని తన అహంకారాన్ని బయట పెట్టుకున్న కోమటిరెడ్డి, నేడు జిల్లా జడ్పీ చైర్మన్‌పై అదే నోటి దురుసు చూపించారని ధ్వజమెత్తారు.
జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి దుర్మార్గంగా వ్యవహరించిన తీరును కేటీఆర్ ఖండించారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పని చేస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులపైన కాంగ్రెస్ పార్టీ అరాచకాలను అడ్డుకొని తీరుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, ప్రతి ఒక కార్యకర్తకు, నాయకుడి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
జడ్పీ చైర్మన్‌తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
జడ్పీ చైర్మన్‌పై మంత్రి కోమటిరెడ్డి వ్యవహరించిన తీరును తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందీప్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. పార్టీ అంతా సందీప్‌రెడ్డికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో ఉన్న కిందిస్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ఎవరికి ఇబ్బంది ఎదురైనా 60 లక్షల మంది కార్యకర్తల బలగం ఉన్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబం భరోసాగా నిలబడుతుందని కేటీఆర్ తెలిపారు. కోమటిరెడ్డి అరాచకపు వ్యవహారంలో గట్టిగా నిలబడి, నిలదీసిన సందీప్‌రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గపూరిత వ్యవహారాలకు దిగినా, ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక హామీ అమలు అయ్యేదాకా ఇలాగే కొట్లాడుదామని సందీప్‌రెడ్డితో కేటీఆర్ అన్నారు.
కోమటిరెడ్డిది అధికార మదం: జగదీశ్‌రెడ్డి
‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికార మదంతో అతి చేస్తున్నాడు. మంత్రి అయిన తర్వాత ఆటవికుడిలా ప్రవర్తిస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో క్యాబినెట్ ర్యాంకులో ఉన్న జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై జరిగిన దాడే అందుకు నిదర్శనం’ అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లుతో కలిసి సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాధవరెడ్డి మంచి నాయకుడే కానీ.. ఆయన కుమారుడు సందీప్‌రెడ్డి ఓ బచ్చా అని కోమటిరెడ్డి అనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మాధవరెడ్డి పేరు చెప్పుకొని బతికినోడివి. ఆయన వెంట ఉన్న వారికి సిగరెట్లు తెచ్చి ఇచ్చినోడివి.. అసలు నీ బతుకేందో గుర్తెరగాలి’ అని కోమటిరెడ్డిపై మండిపడ్డారు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడుతుంటే ఏదో చిల్లరగాడు, చిల్లర మాటలు అనుకున్నాం.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత హీనస్థాయికి దిగజారి మంత్రి అనే విషయం గుర్తెరగకుండా ఊరకుక్కలా మొరుగుతున్నాడని ధ్వజమెత్తారు. ‘అభివృద్ధి నిరోధకుడివి అయిన నీవు.. అనాలోచితంగా, ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజల చేత చెప్పుదెబ్బలు తినడం ఖాయం’ అని కోమటిరెడ్డిని హెచ్చరించారు. ‘క్యాబినెట్ హోదాలో ఉన్న వ్యక్తిని పోలీసు అధికారి ఎలా టచ్ చేస్తారు? దీనిపై డీజీపీ వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలి’ అని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు అత్యుత్సాహం, స్వామి భక్తి ప్రదర్శిస్తే నష్టపోతారని హెచ్చరించారు.
కాంగ్రెస్ నియంతృత్వ పోకడ: హరీశ్‌రావు
యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై అధికారిక కార్యక్రమంలో అకారణంగా దుర్భాషలాడటం కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎలిమినేటి సందీప్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అవమానించడాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు. కాంగ్రెస్ ‘ప్రజాపాలన’లో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరి గర్హనీయమని పేర్కొన్నారు. మొన్న రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టాలని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. నేడు ఏకంగా ఓ జడ్పీ చైర్మన్‌ను వేదికపైనుంచి బ యటకు తీసుకెళ్లాలని పోలీసులకు హుకుం జారీ చేయ డం దారుణమని మండిపడ్డారు. కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యం మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా సందీప్‌రెడ్డికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చూస్తూ ఊరుకోం: రావుల
ఎలిమినేటి సందీప్‌రెడ్డిని పోలీసులతో నెట్టివేయించడం సరికాదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సందీప్‌రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనమని, ఓడిపోయిన నేతలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని, ఇకపై తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సందీప్‌రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.