హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ) : ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫామ్‌హౌస్ ఎఫ్టీఎల్లో ఉందంటున్నరు.. అదేందో నాకు తెల్వదు’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పెద్దలకు ఫామ్‌హౌస్‌లు ఉన్నాయంటున్నారని, సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ఫామ్‌హౌస్ ఉందంటున్నారని, అవెక్కడున్నాయో చూపించాలని ప్రశ్నించారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతల అంశాన్ని ప్రస్తావించారు. జీవో 111 పరిధిలో 30శాతం విస్తీర్ణంలోనే నిర్మాణాలు చేయాలని, హైడ్రా అనేది చెరువులను కబ్జా నుంచి కాపాడేందుకేనని చెప్పారు. చిన్నాపెద్దా తేడాలేకుండా చట్ట ప్రకారం అందరిపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ముఖ్యంగా గండిపేట్ పరివాహక ప్రాంతంలో పార్టీలకు అతీతంగా చాలామంది ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని, కబ్జాదారులు ఎంత పెద్దవారైనా, సినిమా యాక్టైర్లెనా చర్యలుంటాయని తెలిపారు.
అక్టోబర్‌లో ట్రిపుల్ ఆర్కు టెండర్ల ప్రక్రియ చేపడుతామని చెప్పారు. రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఢిల్లీ, బొంబాయిలను తలదన్నేలా ఫోర్త్‌సిటీ తయారవుతుందని, ఫోర్త్‌సిటీకి మెట్రో, ఎయిర్‌పోర్టును కనెక్ట్ చేస్తామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు వివరించారు. ఆరులేన్ల రహదారికి దసరా నాటికి టెండర్లు పూర్తిచేసి నవంబర్ మొదటివారంలో పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. నారపల్లి- ఉప్పల్ ఫ్లైఓవర్ పనులకు రెండు నెలల్లో టెండర్లు పిలిచి ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని చెప్పారు. మన్నెగూడ ఎక్స్‌ప్రెస్‌వే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. అమెరికా తరహా రోడ్లు అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నామని, హడ్కో ద్వారా రుణం తీసుకొని గ్రామీణ రోడ్లను బాగుచేస్తామని తెలిపారు.