హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్-విజయవాడ రహదారిలో వాహనదారులకు టోల్ వసూళ్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన విజ్ఞప్తిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే వాహనాలకే టోల్ మినహాయింపు అడగడం ఏమిటని, కరీంనగర్, ఆదిలాబాద్, బెంగళూరు తదితర మార్గాల్లో వెళ్లే వాహనాలకు టోల్ మినహాయింపు ఇవ్వాలని ఎందుకు కోరలేదని పలువురు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఎవరో చేసే ప్రచారాన్ని పట్టించుకోబోనని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆ రహదారిలో టోల్ వసూళ్ల నుంచి వాహనదారులకు మినహాయింపు ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశానని గుర్తుచేశారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల వాహనాలకు కూడా టోల్ మినహాయింపును కోరే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
నిర్మాణరంగ కోర్సుల్లో ఉచిత శిక్షణ
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ), ఈజీఎంఎం సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్మాణరంగ కోర్సుల్లో ఉచిత శిక్షణ, ఉపాధి కలిపిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. 18 నుంచి 35 ఏండ్లలోపు వయసు ఉన్న గ్రామీణ తెలంగాణ యువత ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఇంజినీరింగ్ యువతకు ఫినిషింగ్ సూల్, ఎంఈపీ టెక్నీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన ఇస్తున్నట్టు తెలిపారు. మూడు నెలల శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతోపాటు న్యాక్ సర్టిఫికెట్, ఆకర్షణీయమైన వేతనంతో నిర్మాణరంగంలో ఉద్యోగం కల్పించనున్నట్టు తెలిపారు. 15వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.