Minister Komatireddy | యాదాద్రి భువనగిరి, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఆ పార్టీని 14 ముక్కలు చేస్తామని ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 39 ముక్కలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి సొమ్మును కక్కించి తీరుతామని తేల్చి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఆదివారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్టుగా బీఆర్ఎస్ను బరాబర్ బొందపెడతామని పేర్కొన్నారు. తాము తిట్టాలనుకుంటే కేటీఆర్ కంటే ఎక్కువే తిడతామని చెప్పారు. ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను అమలు చేసినందుకు కేటీఆర్ ఒక్కసారైనా హర్షం వ్యక్తం చేశారా? అని ప్రశ్నించారు. తామిచ్చిన ఆరు హామీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గ్రామ సభల ద్వారా గ్రామానికి 100 ఇండ్లు ఎంపికచేసి నిర్మించి ఇస్తామని తెలిపారు. రాయగిరి రైతుల విజ్ఞప్తి మేరకు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని, నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని మంత్రి తెలిపారు.
ఆరు లక్షల కోట్ల అప్పు
యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో రూ.10వేల కోట్ల అక్రమాలు జరిగాయని, దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతున్నదని వెంకట్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం గొర్లు, బర్లు, బతుకమ్మ చీరల పంపిణీ తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి సొమ్ముతో 20 ఏండ్లపాటు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని వివరించారు. యాదగిరిగుట్ట పైకి ఆటోలను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం రూ. ఆరు లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బడాబాబులకు రైతుబంధు అమలు చేసి, కౌలు రైతులను మరిచిపోయిందని విమర్శించారు.
ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు
తమ ప్రభుత్వం వచ్చి 40 రోజులే అయిందని, రాష్ర్టాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని వెంకట్‌రెడ్డి చెప్పారు. రోజూ 30-35లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని తెలిపారు. మిగిలిన నాలుగు గ్యారెంటీలను దశలవారీగా అమలు పరుస్తామని పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజా ప్రతినిధులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో రూ. 100 కోట్లతో మాడల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. భువనగిరి ఖిలా రోప్‌వే నిర్మాణం త్వరలోనే మొదలవుతుందని తెలిపారు. కొలునుపాకను పర్యాటక ప్రాంతంగా మారుస్తామని చెప్పారు