Komatireddy | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంలో సరికొత్త వివాదం రాజుకున్నది. హెలికాప్టర్ వినియోగంలో నేను సీఎంకన్నా తక్కువకాదు అనే రీతిలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహరించడమే ఇందుకు కారణం. ‘నేను త్యాగం చేస్తేనే ఆయనకు సీఎం పదవి వచ్చింది. నాకే హెలికాప్టర్ లేదంటారా? నేను ఎప్పుడు అవసరమైతే అప్పుడు హెలికాప్టర్‌ను వాడుకుంటాను’ అని మంత్రి కోమటిరెడ్డి ఉన్నతాధికారితో వ్యాఖ్యానించడం ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది.
అత్యవసర సమయాల్లో తప్ప మంత్రులు హెలికాప్టర్ వినియోగానికి నిబంధనలు వర్తించవని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సీఎంకు.. కొందరు సీనియర్ మంత్రులకు మధ్య గ్యాప్ వచ్చిందనే వాదనలు వినిపిస్తున్న ప్రస్తుత సందర్భంలో హెలికాప్టర్ వ్యవహారం సరికొత్త తలనొప్పికి దారితీసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మంత్రి కోమటిరెడ్డి తరచూ నల్లగొండ పర్యటన కోసం హెలికాప్టర్ కావాలంటున్నారు.
ఇప్పటికే పలుమార్లు హెలికాప్టర్‌ను వాడుకున్న మంత్రి కోమటి రెడ్డి .. ఇటీవల హెలికాప్టర్ కావాలని కోరడంతో ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఇందుకు నో చెప్పినట్టు సమా చారం. ముఖ్యమంత్రికి మాత్రమే హెలికాప్టర్ ఉపయోగించే వీలుంటుందని, మంత్రులు అత్యవసర సమయాల్లో మినహా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించే వీలుండదని సదరు అధికారి తమ నిబంధనల గురించి మంత్రికి సున్నితంగా చెప్పారు.
దీనిపై మంత్రి కోమటిరెడ్డి కొంత అసహనం వ్యక్తం చేస్తూ… ‘నేను త్యాగం చేస్తేనే ఆయన సీఎం అయ్యారు. మీరు నాకే హెలికాప్టర్ లేదంటారా.. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు హెలికాప్టర్‌ను వాడుకుంటా ను. నేను వెళ్లే పని అత్యవసరం కాదనా.. మీ ఉద్దేశం’ అని పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ఏమి చేయాలో అర్థంకాక సదరు ఉన్నతాధికారి తలపట్టుకున్నట్టు సమాచారం.