చెప్పేదొకటి, చేసేదొకటి! కండ్లముందు కనిపిస్తూనే ఉన్నా.. లేదని నమ్మబలకడం.. కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారింది. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి ఒక ఆకు ఎక్కువే చదివినట్టున్నారు. ఒకవైపు ఆంధ్రా సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వబోమంటూ చెప్తున్న ఆర్అండ్బీ మంత్రి.. తన నియోజకవర్గంలోనే అనేక పనులను రెడ్‌కార్పెట్ పరిచి మరీ ఆంధ్రా సంస్థలకు అప్పగించారు. అదే సమయంలో తెలంగాణ కాంట్రాక్టర్ల పనులు ఇవ్వకుండా, పనిచేసినా బిల్లులు ఇవ్వకుండా తిప్పుకొంటున్నదీ సదరు మంత్రిగారే! పైకి మాత్రం తామేదో నికార్సైన తెలంగాణవాదులమన్నట్టు, తెలంగాణ పక్షపాతాన్ని నరనరాన ఇంకించుకున్నట్టు కలరింగ్ ఇస్తారు. అసలు రంగు ఏమిటో, లోగుట్టు ఎలాంటిదో నల్లగొండలో పలు కాంట్రాక్టులు దక్కించుకున్న ఆంధ్రా సంస్థలను చూస్తే అర్థమైపోతుంది.
నల్లగొండ ప్రతినిధి, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోమంటూ, అందుకోసం ఎలాంటి చట్టమైనా తేవడానికి వెనుకాడబోమని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్య లు ఇప్పడు కాంట్రాక్టర్ల వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన సొంత ఇలాకా నల్లగొండ నియోజకవర్గంతోపాటు జిల్లా పరిధిలో జరిగే పలు ప్రాజెక్టులకు సంబంధించిన కీలక పనులన్నీ ఆంధ్రాప్రాంతానికి చెందిన వ్యక్తి కంపెనీనే చేస్తుండటం గమనార్హం. పొద్దునలేస్తే కేసీఆర్, ఆయన కుటుంబంపై నోరుపారేసుకునే మంత్రి కోమటిరెడ్డి.. సంచలనాల కోసం చేసే ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో చేతలకు, ఆయన చిత్తశుద్ధికి పొంతన ఉండదని మారోసారి స్పష్టమైంది.
ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఒక్క ప్రాజెక్టూ ఇవ్వబోమని ప్రకటన చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి.. ఆయన ఇలాకాలో ప్రస్తుతం జరుగుతున్న కీలక పనులన్నీ ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ సంస్థ చేతిలోనే ఉన్నాయి. ఆయన సొంత నియోజకవర్గం నల్లగొండలో సీసీ రోడ్లతోపాటు ఘాట్ రోడ్డు పనులు, జిల్లా పరిధిలోని ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ లైనింగ్ పనులు సైతం సదరు కాంట్రాక్టు సంస్థనే దక్కించుకున్నది. నెల్లూరుకు చెందిన వ్యక్తి చైర్మన్ అండ్ ఎండీగా ఉన్న కంపెనీయే పనులన్నీ చేజిక్కించుకుంది. ఈ పనులన్నీ ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
గత ఏడాది మే నెలలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ప్రధానకాల్వ సీసీ లైనింగ్ పనుల కోసం ప్రభుత్వం రూ.442 కోట్లను మంజూరు చేసింది. గత డిసెంబర్లో టెండ ర్లు పిలువగా.. బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.349 కోట్ల టెండర్ దక్కించుకున్నది. 113కిలోమీటర్ల సీసీ లైనింగ్ ప నులను బృందా ఇన్ఫ్రా గత వారమే ప్రారంభించింది. ఆంధ్రా కంపెనీలకు కాంట్రాక్టులివ్వబోమన్న కోమటిరెడ్డి.. ఏఎంఆర్పీ లైనింగ్ పనుల కోసం ప్రత్యేకంగా పట్టుబట్టి ఆంధ్రా ప్రాంతానికి చెందిన బృందా కంపెనీని టెండర్లల్లో పాల్గొనేలా ప్రోత్సహించినట్టు తెలిసింది. దీంతో ఈ పనులు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయి. నాలుగేండ్లలో మొత్తం ప్రధాన కాల్వపొడవునా ఈ పనులను పూర్తి చేసేలా బృందాకు అప్పగించినట్టు సమాచారం. ఇదీ మంత్రిగారి చిత్తశుద్ధి!
ఒకవైపు ఆంధ్రా కాంట్రాక్టర్లను అడుగుపెట్టనివ్వబోమంటూ మంత్రిగారు బీరాలు పలుకుతున్నారే గానీ.. ఆంధ్రా కాంట్రాక్టర్లపై ఆయనకున్న అవ్యాజప్రేమ నల్లగొండ ప్రజలకు విదితమే! ఇక తన సొంత నియోజకవర్గం నల్లగొండలోనూ పలు పనులను బృందా ఇన్ఫ్రా కంపెనీనే దక్కించుకోవడంలో కోమటిరెడ్డి కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. నల్లగొండ కార్పొరేషన్లో మునుగోడు బైపాస్ రోడ్డు నుంచి లతీఫ్‌సాహెబ్ గుట్టపైకి ఘాట్ రోడ్డును ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదించింది. రూ.140 కోట్ల విలువైన ఆ పనులు సైతం మరో కంపెనీతో కలిపి జాయింట్ వెంచర్లో బృందా కంపెనీనే చేజిక్కించుకున్నది. ఐదున్నర కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు పనులు ప్రస్తుతం 40శాతం వరకు పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.
ఇవి 2027 నవంబర్ వరకు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ రూ.20 కోట్ల బిల్లులు చెల్లించినట్టు తెలిసింది. ఈ పనుల కోసం తెలంగాణకు చెందిన పలు కాంట్రాక్టు సంస్థలు పోటీపడినా బృందా కంపెనీకే దక్కాయి. మంత్రిగారి కరుణాకటాక్షాలు కూడా ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌పై ఉండటం వల్లే ఇదంతా సాధ్యమైందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. అదే సమయంలో నల్లగొండ కార్పొరేషన్లో సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధుల (ఎస్డీఎఫ్) కింద సీసీ రోడ్లతోపాటు ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ పనులు కూడా బృందా కంపెనీనే దక్కాయి. రూ.109 కోట్ల విలువైన ఈ పనులను ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి.
రోడ్లు, భవనాల శాఖతోపాటు ఇతర శాఖల్లో రెండున్నరేండ్లుగా పనులు చేస్తున్న స్థానిక కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీరంతా పెండింగ్ బిల్లుల కోసం మంత్రి కోమటిరెడ్డితోపాటు ప్రభుత్వ పెద్దల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పలు ఆర్అండ్బీ, పీఆర్ రహదారుల పనులు చేపట్టారు. వీటిని స్థానిక కాంట్రాక్టర్లు దక్కించుకున పనులు కొంతమేర చేపట్టారు. అయితే వీరికి నేటికీ బిల్లులు రాకపోవడంతో పనులను ఎక్కడికక్కడే నిలిపివేశారు. నల్లగొండ పట్టణంలో ప్రధాన రహదారులతోపాటు నల్లగొండ నుంచి ముషంపల్లి రోడ్డు, కంచనపల్లి నుంచి నేరడ వరకు, గుండ్లపల్లి క్రాస్‌రోడ్డు నుంచి కురంపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులకు టెండర్లు పిలిచారు. ఈ రోడ్లన్నీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నియోజకవర్గంలోనివే.
ఈ పనుల్లో వేటికి బిల్లులు చెల్లిస్తున్న దాఖలాలు లేవు. జిల్లాలోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.20 వేల కోట్ల ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ విభాగంలోని బిల్లుల చెల్లింపుల కోసం ఇప్పటికే కాంట్రాక్టర్లు ఆందోళనబాట పట్టారు. ఈ నెల 18వ తేదీన చలో సెక్రటేరియట్ ముట్టడికీ కాంట్రాక్టర్లు పిలుపునిచ్చారు. చిన్నకాంట్రాక్టర్లతోపాటు, మన ఊరు-మన బడి కింద పనులు చేసినవారూ తమకు రావాల్సిన బకాయిల కోసం పోరుబాట పడుతున్నారు. పనులు చేసినా.. తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు చేతులు రాని మంత్రి కోమటిరెడ్డి.. మరోవైపు ఆంధ్రా సంస్థలకు కాంట్రాక్టులిస్తుండటం ఆయన ద్వంద్వవైఖరికి నిదర్శనం. అదే సమయంలో ఆంధ్రా సంస్థలకు పనులివ్వబోమంటూ ప్రకటనలు జారీ చేస్తూ తొడగొడుతుండటం మరీ హాస్యాస్పదం.