నీలగిరి, జనవరి 27: విద్యను కార్పొరేటీకరణ చేసి వ్యాపార వస్తువుగా మార్చారని, తనకు అవకాశం వచ్చి విద్యాశాఖ మంత్రిని అయితే తక్షణమే కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ పట్టణంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల (బొట్టుగూడ హైస్కూల్)ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం పేద పిల్లలు వచ్చి సహకరించాలని కోరితే.. తాను సదరు సంస్థలకు ఫోన్ చేస్తే రూ. రెండు లక్షలున్న ఫీజు రూ.మూడు లక్షలు చెప్పి, రూ.లక్ష తగ్గిస్తానని దొంగ మాటలు చెప్పారని విస్మయం వ్యక్తంచేశారు. ఇలాంటి విద్యా సంస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. విద్యను అమ్ముకుంటున్నారని, విద్యను వ్యాపారం చేశారని ఆరోపించారు. విద్యాచట్టంలో 25శాతం పేదలకు సీట్లు ఇవ్వాలని ఉన్నదని, కానీ ఈ కార్పొరేట్ దొంగ లు వాటికి తూట్లుపొడిచి పేద ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు.