Komatireddy | మంత్రి పదవి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజిలో తాను లేనని స్పష్టం చేశారు.
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కేంద్ర పెద్దలు ఇచ్చిన హామీ గురించి తనకు తెలియదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంత్రి పదవిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎంతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కేబినెట్లో తాను సీనియర్ మంత్రి అయినప్పటికీ హైకమాండ్ నిర్ణయమే కీలకమని చెప్పారు. సీఎం, పీసీసీ చీఫ్ కలిసి పదవులపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తాను మంత్రి పదవి ఇచ్చే.. ఇప్పించే పరిస్థితుల్లో లేనని తెలిపారు. అంతా హైకమాండ్, రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని అన్నారు. నేనే కాదు, ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.
అంతకుముందు నల్గొండలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానని అన్నారని గుర్తుచేశారు. భువనగిరి ఎంపీ స్థానం గెలిచినప్పుడూ కూడా అదే మాట చెప్పారని అన్నారు. కానీ ఇప్పుడు పార్టీలు మారిన వాళ్లకు, తనకంటే చిన్నవారికి పదవులు ఇచ్చారని తెలిపారు. . మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా.. మీ ఇష్టం అని అన్నారు. ఎవరి కాళ్లూ మొక్కి నేను పదవులు తెచ్చుకోగదలచుకోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. దిగజారి బతకడం నాకు తెలియదని అన్నారు. మనసు దిగజార్చుకుని బతకడం ఇక నావల్ల కాదంటూ అసహనం వ్యక్తం చేశారు.
తన స్వార్థం కోసం పదవి అడగడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో పదవులు అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలని లేదని అన్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు, వాళ్ల సంక్షేమం కోసం కావాలన్నారు.