హైదరాబాద్(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులకు కరెంటు కష్టాలు నిజమేనని ప్రభుత్వం మరోసారి అంగీకరించింది. రాష్ట్ర రైతాంగానికి సరిపడా కరెంట్ ఇవ్వలేకపోతున్నాయని ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొనగా.. తాజాగా రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి కేజే జార్జ్ కర్ణాటకలో నెలకొన్న కరెంట్ సంక్షోభ పరిస్థితులను వివరించారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాలకు తగినట్టు విద్యుత్తు సరఫరా చేయలేకపోతున్నామని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, దానికి తగినట్టుగా ఉత్పత్తి తమ వద్ద లేదన్నారు.
రైతులకు గతంలో 7 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా ఉండేదని, కాని ప్రస్తుతం తమ ప్రభుత్వం విద్యుత్తు సరఫరా సమయాన్ని 5 గంటలకు కుదించిందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా రైతులకు కరెంట్ సరఫరా చేయలేకపోతున్నామని చెప్పారు. విద్యుత్తు కొరతపై చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో రెండు రోజుల్లో సమావేశం జరుగనున్నదని, ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసే విషయంపై నిర్ణయం తీసుకొంటామని వెల్లడించారు. పక్క రాష్ర్టాల నుంచి కూడా విద్యుత్తు కొనేందుకు చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.