కొల్లాపూర్ : ఏసుప్రభు బోధనలు ప్రపంచానికి మార్గదర్శకమని ఆచరణీయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం కొల్లాపూర్ పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ ప్రేమ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనిషి జన్మ సార్థకం కావాలంటే ఏసు బోధించిన ప్రేమ సమానత్వం బాటలో నడవాలన్నారు. మనిషి పుట్టినప్పుడు శ్వాస ఉంటుందని మనిషి పోయిన తర్వాత పేరు మాత్రమే ఉంటుందన్నారు.
అందర్నీ ప్రేమించడం అందరిని సన్మార్గంలో పెట్టడం ఏసు బోధించిన బోధనల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ఏసు మార్గం చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందని శాంతి సమానత్వం ప్రేమను పంచుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలన్నారు. అనంతరం కేకును కట్ చేసి క్రిస్టియన్స్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు, అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ కల్చరల్ హాల్ కోసం రూ. 25 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ భన్సిలాల్, తాసిల్దార్ లు భరత్ కుమార్, విజయ్ కుమార్, శ్రీనివాస్, రాజ్ కుమార్ ఆర్ఐ గోవింద్ రెడ్డి,రెవెన్యూశాఖ సిబ్బంది, వివిధ చర్చిల పాస్టర్స్ పాల్గొన్నారు.