హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని గ్లోబల్ టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో పర్యాటకశాఖ సహకారంతో ఆదివారం తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ సౌతిండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్‌లో మంత్రి ప్రసంగించారు. ప్రకృతి రమణీయతకు ఈ ప్రాంతం ప్రతీకగా నిలుస్తుందని, ఎన్నో సుందరమైన ప్రదేశాలు, పుషలమైన వనరులు ఉన్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే అద్భుతమైన డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు.
దీనికోసం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల (పీపీపీ) ద్వారా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామని చెప్పారు. తద్వారా పర్యాటక శాఖ అభివృద్ధితో ఆదాయం పెరగడంతోపాటు యువతకు గణనీయమైన ఉపాధి అవకాశాలను లభిస్తాయని మంత్రి వివరించారు. మెడికల్, ఎకో, అడ్వెంచర్, ఆధ్యాత్మిక టూరిజం సహా పర్యాటకానికి అవసరమున్న వివిధ రంగాలపై దృష్టి సారించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ఎండీ రమేశ్‌నాయుడు, పర్యాటక శాఖ డైరెక్టర్ కే నిఖిల, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాం బాబు తదితరులు పాల్గొన్నారు.