హైదరాబాద్ : విద్యుత్ సంస్థలకు వినియోగదారులే యజమానులు అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సంస్థలో నూతనంగా ఉద్యోగంలో చేరేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవలన్నారు. వినియోగదారుల పట్ల పాజిటివ్ దృక్పథంతో వ్యవహరించ గలిగితే సంస్థాపరంగా అద్భుతమైన విజయాలు నమోదు చేసుకోవొచ్చని ఆయన తెలిపారు. టిఎస్ఎస్ పిడిసిఎల్ లో నూతనంగా నియమితులైన 48 అసిస్టెంట్ ఇంజినీరింగ్ ఉద్యోగులకు మింట్ కాంపౌండ్ లోని టిఎస్ఎస్ పిడిసిఎల్ కార్యాలయంలో నియామకపు ఉత్తర్వులను అంద జేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేసే పనిని ఇష్టంగా చేసినప్పుడు మాత్రమే ఆ పని కష్టం అనిపించదన్నారు. విద్యుత్ ఉద్యోగులు విధి నిర్వహణలో వినియోగదారుల పట్ల అనుచితంగా ప్రదర్శించ రాదని హితవు పలికారు. 50 సంవత్సరాలు ఒకే సంస్థలో పని చేసిన రికార్డ్ ప్రభాకర్ రావు సొంతం చేసుకున్నారన్నారు.
జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆఫర్ చేసినా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఉన్న విశ్వాసంతో తొమ్మిది సంవత్సరాలు గా ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలను సంస్కరిస్తున్నారని ప్రశంసించారు.అదే సమయంలో రఘుమా రెడ్డి విద్యుత్ సంస్థను సొంత ఇల్లు అనుకుని సంస్థలో పనిచేసే సిబ్బందిని కుటుంబం అనుకుని తనకున్న అపార అనుభవంతో పారదర్శకంగా సంస్థను నడిపిస్తున్నారని కొనియాడారు.
ఇప్పటి వరకు ఒక్క విద్యుత్ సంస్థలోనే 30 వేల ఉద్యోగ నియామకాలు జరిగాయన్నారు. ఉద్యోగ నియామకాలు జరగ లేదు అనే వారికి కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు చెంప చెల్లు మనిపించేలా సమాధానం చెప్పాలని మంత్రి సూచించారు. టిఎస్ఎస్ పిడిసిఎల్ ఎండీ రఘుమారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో & జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.