హైదరాబాద్ : ప్రజలను మోసగించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్ అయ్యారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ హామీలపై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ హామీలు బోగస్, ప్రజలను మోసగించడం కాంగ్రెస్ పార్టీ నైజం. కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ ప్రజల వైపు లేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదన్నారు. దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.
అబద్ధపు హామీలు ఇచ్చే అలవాటు లేని నేత సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఇచ్చిన హామీలు బఫూన్, బుడ్డర్ ఖాన్‌లను తలపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అందులో ఒక్కటి అంటే ఒక్కటి కూడా అమలు చేయగలిగినవి లేవన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఏలుతున్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా నిన్న ప్రకటించిన పథకాలు లేవు. అబద్ధాలు చెప్పి ఆ పార్టీ ప్రజలను మోసగించాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ పాచికలు పారవన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు.