సూర్యాపేట, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ శ్రేయస్సునే కోరుకుంటున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతగా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ పార్టీ బృందం కలువడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతోపాటు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా గవర్నర్‌ను పర్యటించాలని కోరడంతో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ బీ టీమ్‌గా మారిందని మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. వరదలపై గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రం నుంచి పరిహారం ఇప్పించాలని కోరకుండా రాజకీయం చేయడం గమనార్హమని అన్నారు. మంగళవారం మంత్రి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరుసగా నాలుగేండ్ల నుంచి వరదలు వస్తుంటే కేంద్రాన్ని ఏనాడూ ప్రశ్నించని కాంగ్రెస్ పార్టీ బీజేపీపై భక్తిని చాటుకుంటున్నదని విమర్శించారు.
పైగా ఎప్పటికప్పుడు వరద పరిస్థితులు, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్‌పై నిందలు వేస్తున్నదని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాల నుంచి సంభవిస్తున్న వర్షాలకు జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని తెలిపారు. కేంద్రం ఏనాడూ పైసా విదల్చలేదని విమర్శించారు. అటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన కాంగ్రెస్ పార్టీ మోదీ జోలికి పోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం వెనుక ఉన్న మర్మం బీజేపీకి కాంగ్రెస్ బీ టీమ్ కావడమేనని తెలిపారు. గుజరాత్లో వరదలు వస్తే కేంద్రంలోని బీజేపీ సర్కారు వెంటనే స్పందించి నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రశ్నించకుండా బురద రాజకీయాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. వరద సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించి నష్టనివారణ చర్యలు తీసుకున్న ఏకైక ప్రభుత్వంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. ముందెన్నడూ లేనిరీతిలో సహాయక చర్యలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందని కొనియాడారు.