సూర్యాపేట : 60 ఏండ్లు పాలించినా కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొమ్మిదేళ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy)తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రాబోయే శాసనసభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని షురూ చేసింది. జిల్లాలోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం గ్రామంలో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్థానిక రామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచార కార్యక్రమానికి తెరలేపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలను సర్వనాశనం చేసిన కుంటి, ముసలి గుర్రాలతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. స్వల్ప కాలంలోనే తమ నియోజకవర్గాల్లో వేలాది కోట్లతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది మీకు మీరు వేసుకున్నట్టే అన్నారు. మనం వేసే ఓటు మన తలరాతను మారుస్తుందన్నారు. ఎవరి హయాంలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. సైదిరెడ్డి చనువు, చొరవ ఉన్న నాయకుడు కాబట్టే నియోజకవర్గంలో పుట్టిన బిడ్డగా ప్రజల రుణం తీర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు.
సార్ అని పిలిపించుకునే నాయకులు కావాలో, అన్నా అంటే ఆప్యాయంగా దగ్గరికి వచ్చే సైదిరెడ్డి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. యువకుడైన సైదిరెడ్డికి మరోసారి అండగా ఉండి, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.