సూర్యాపేట : సీఎం కేసీఆరే తెలంగాణకు గ్యారంటీ, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ సమాజానికి వారంటీ అని మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మొదట గా పాత ఎస్పీ కార్యాలయం ఆవరణలో రూ. 50 కోట్లతో నిర్మించనున్న క్రీడా పాఠశాల, అంతర్జాతీయ స్థాయి ఆధునిక స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నాలుగో వార్డులో కాసింపేట వద్ద ఎస్సారెస్పీ కాలువపై రైతులకు ఉపయోగపడే విధంగా బ్రిడ్జి నిర్మానానికి శంకుస్థాపన చేశారు, అనంతరం ఎద్దుల చెరువు ట్యాంక్‌బండ్ సమీపంలో 80 లక్షల వ్యయం తో నిర్మించిన కుమ్మరి సంక్షేమ భవన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో ఆదరణకు నోచుకొని కులవృత్తులకు సీఎం కేసీఆర్ మళ్లీ జీవం పోశారన్నారు.
సూర్యాపేటలో కులమతాలకతీతంగా అభివృద్ధి జరుగుతుందని, ఒకవైపు జిల్లా అభివృద్ధి మరోవైపు కులసంఘాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని, ఆత్మగౌరవానికి ప్రతీకగా కులసంఘాల భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కుల కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించడం ద్వారా వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపిన ఘనత కేసిఆర్ దే అన్నారు.
మనుషులను నాగరికత సమాజం వైపు నడిపియడంలో శాలివాహన కులస్తులదే ప్రముఖపాత్ర అని కొనియాడారు. 2014 కు ముందు అస్తవ్యస్తమైన పాలనతో ఆకలి కేకలతో అలమటించిన తెలంగాణ 9 ఏళ్లలోనే దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా అవతరించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత నే దీనికి కారణం అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి హ్యాట్రిక్ విజయం లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.