సూర్యాపేట: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ (Telangana) నంబర్ వన్ అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు (Dalit Bandhu) పథకం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. ఏ పార్టీ వల్ల తమ బ్రతుకులు బాగుపడ్డాయో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. 2014లో బీఆర్ఎస్కు వేసిన ఓటు రూ.7500 కోట్ల విలువైన నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. ఇప్పటివరకు సూర్యాపేటలో (Suryapet) జరిగిన అభివృద్ధి కేవలం ఆరంభం మాత్రమేనని, ఇంకా చేయవలసింది చాలా ఉందని చెప్పారు. పార్టీలకు అతీతంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో
బచ్చలకూరి శేఖర్, ఇరుగు నవీన్, బచ్చలకూరి కరుణాకర్, బచ్చలకూరి అరవింద్, గుర్రాల రాంబాబుతోపాటు 25 దళిత కుటుంబాలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.