సూర్యాపేట, జూలై 23 (నమస్తే తెలంగాణ): బీజేపీ దుర్మార్గాలకు మణిపూర్ ఉదంతం పరాకాష్టగా నిలిచిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్ధిపొందాలన్నది బీజేపీ పథకమని ఆయన ఆరోపించారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘ్ పరివార్ క్రియేటివిటిలో భాగమే పుల్వామా దాడులని ఆయన అభివర్ణించారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి కశ్మీర్లో మరో రచ్చ సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. బీజేపీపై దేశ ప్రజల్లో భ్రమలు తొలగడంతో అడ్డదారిలో మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలన్నది సంఘ్ పరివార్ ఆలోచన అని విమర్శించారు. అయితే దేశ వ్యాప్తంగా మోదీపై ప్రజల్లో మోజు తగ్గిందని, కర్ణాటక ఫలితమే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ విధానాలు సామాన్యులకే కాకుండా విద్యావంతులకూ నచ్చడం లేదని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీన పడిందని అన్నారు.