సూర్యాపేట : ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల చూపిస్తున్న ఆదరణ సూర్యాపేటలో గెలుపును ఖాయం చేసిందని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagadish Reddy )పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో అనుసరించాల్సిన విధి విధానాలపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాబోయే ఐదు రోజులే సూర్యాపేట భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు.
పల్లె, పట్టణ ప్రజలంతా బీఆర్ఎస్ తోనే ఉన్నారన్న మంత్రి..ప్రచారంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణతో గెలుపు విషయంలో ఢోకా లేదన్నారు. హ్యాట్రిక్ ఖాయం అని స్పష్టం చేశారు. చేయాల్సిందల్లా సమిష్టిగా పని చేసి భారీ మెజారిటీ వచ్చేలా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గడప గడపకు సంక్షేమ పథకాలనువివరించి ..లబ్ధిదారులతో మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. ఓటర్ లిస్ట్ ను అవపోసన పట్టడం అనేది ఎన్నికలలో ముఖ్య ఘట్టం అన్నారు.
మీ గ్రామానికి చెందిన ఓటర్ లిస్ట్ పై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. నాయకులు ఇగోలను పక్కన పెట్టి ఒకటై పని చేస్తే మండలానికి పదివేల మెజార్టీ రావడం ఖాయం అన్నారు. ఈ ఐదు రోజులు అన్ని పనులు పక్కనపెట్టి ప్రజలమధ్యనే ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించి రాబోయే విజయంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.