సూర్యాపేట : రైతాంగ సాయుధ పోరాటాల ద్వారానే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నిజాం నిరంకుశత్వంపై దివంగత భీంరెడ్డి నరసింహా రెడ్డి తిరుగుబాటు చేసి వెట్టి చాకిరి నుంచి ప్రజలకు విముక్తి కల్పించారన్నారు. రైతాంగ సాయుధ పోరాట నిర్మాత ,మార్కిస్టు నేత
భీంరెడ్డి నరసింహా రెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి మంత్రి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వంపై మొట్టమొదటి సారిగా తిరుగుబావుటా ఎగురవేసిన నేతగా బీఎన్ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. అటువంటి చరిత్రను దిశ దశలు వ్యాపింప చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. దోపిడీ పాలన అంతానికి అగ్గి రాజేసిన మహా యోధుడిగా ఆయన కీర్తించబడుతున్నారని తెలిపారు.
తనకు జన్మనిచ్చిన ప్రాంతంలో గోదావరి నది జలాలతో సస్యశ్యామలం కావాలని బీఎన్ రెడ్డి పరితపించే వారన్నారు. ఆ తపనను ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాకారం చేశారన్నారు. బీఎన్ రెడ్డి పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవీ తదితరులు పాల్గొన్నారు.