Jagadish Reddy | నల్లగొండ : భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్( babu Jagjivan Ram )ను ఏ ఒక్కరికో పరిమితము చేయొద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagadish Reddy ) సూచించారు. నవ భారత నిర్మాణంలో ఆయన ఒక శిల్పి అని మంత్రి కొనియాడారు. దివంగత బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా రూపొందించిన బాబు జగ్జీవన్ రామ్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, కవి,రచయిత విశ్రాంత ఇంజినీర్ దున్న యాదగిరి, ఎస్పీ అపూర్వ రావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ స్ఫూర్తి దేశానికి మార్గదర్శనం అయ్యిందన్నారు. అటువంటి చిరస్మరణీయుల చరిత్ర వర్తమానానినికి అందించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. చదువుతోటే పురోగతి సాధ్యం అని మొదట గుర్తించింది పూలే అని ఆయన గుర్తుచేశారు. చదువు లేకపోవడంతో పాటు కులాల పునాదుల మీద నిర్మాణం జరిగిన భారతదేశం మీదకు వైశాల్యంలో గానీ, జనాభా పరంగా గానీ నూరో వంతు కుడా లేని దేశాలు దండయాత్ర సాగించయన్నారు. అటువంటి విపత్కర పరిస్థితులను అధిగమించి ఉన్నతస్థాయికి ఎదిగిన రత్నాలలో బాబు జగ్జీవన్ రామ్ ఒకరు అని మంత్రి జగదీశ్ రెడ్డి కొనియాడారు.