Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన షాక్‌కు విపక్షాలు ఇప్పట్లో కోలుకోవని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీతో పాటు ప్రభుత్వం ఆర్టీసీ విలీనం, పోడుభూములకు పట్టాలు, వీఆర్ఏల క్రమబద్దీకరణ నిర్ణయాలతో ప్రతిపక్షాలకు షాక్‌కు గురయ్యాయన్నారు. ఈ నెల 20న సూర్యాపేటలో నిర్వహించ తలపెట్టిన సీఎం కేసీఆర్ సభ చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతుందన్నారు.
పరిపాలనా వికేంద్రీకరణ కోసం జరిగిన నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లాకేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యాపేటలో ఊహకందని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. ఆ క్రమంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాలను, ఎస్పీ కార్యాలయాన్ని, సమీకృత మార్కెట్ భవనంతో పాటు మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి వెంట జ్పడీ చైర్మన్ గుజ్జ దీపికా, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య, మండలి సభ్యుడు కోటిరెడ్డి, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాధరి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎన్ భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.