సూర్యాపేట: ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సంస్థలు పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ (PM Modi) పాలనలో ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ స్వాతంత్య్రాన్ని కోల్పోయాయని విమర్శించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొంతకాలంగా బీజేపీ (BJP) నేతలు చేసిన ఆరోపణలపైనే ఎక్కువగా సీబీఐ (CBI),ఈడీలు (ED) పనిచేస్తున్నాయని అర్థమవుతుందన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు.
బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికమని మంత్రి అన్నారు. ఆ పార్టీ అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అణచివేతలు, జైళ్లను నింపడం ద్వారా ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని చరిత్ర చెబుతుందని వెల్లడించారు. కమలం పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో నే ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ (Telangngana) సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బొడ్రాయి పండుగ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం రామచంద్రాపురంలో నిర్వహించిన బొడ్రాయి, కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమతమ మతాచారాలకు అనుగుణంగా దైవ చింతనను కలిగి ఉండాలని చెప్పారు. దైవారాధనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని చెప్పారు. మతాలకు అనుగుణంగా ప్రభుత్వమే పండుగలను నిర్వహించే సంస్కతి తెలంగాణలో మాత్రమే ఉందన్నారు.