నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): బీజేపీలో చేరినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇస్తున్న రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు డబ్బులను మునుగోడుతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం ఇవ్వాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధికి ఆ డబ్బులు ఇస్తామంటే మునుగోడు ఉప ఎన్నిక బరిలోంచి తప్పుకొనేందుకు సిద్ధమేనని.. అందుకు బీజేపీ సిద్ధమా? అని మోదీ, అమిత్‌షాలకు సవాల్ విసిరారు. సవాల్‌కు ముందుకొస్తే తమ అధినేత కేసీఆర్‌ను ప్రాధేయపడైనా తాము ఒప్పిస్తామని, వామపక్ష నేతల సాక్షిగా ఈ సవాల్ చేస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే బీజేపీ కుట్రలు, కుతంత్రాలతో మునుగోడు ఉప ఎన్నికను తెచ్చిందని ధ్వజమెత్తారు. బీజేపీ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా మునుగోడులో భంగపాటు తప్పదన్నారు. సోమవారం మునుగోడు మండలం కొరటికల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సస్యశ్యామలం అవుతుంటే ఓర్వలేని బీజేపీ మంటలు పెట్టేందుకు సిద్ధ్దపడుతున్నదని ఆరోపించారు. పొద్దున లేస్తే మతం పేరుతో వేదాలు వల్లించే మోదీ సర్కార్ యాదాద్రి ఆలయాన్ని వెయ్యి కోట్లతో పునర్నిర్మిస్తుంటే ఎందు కు ఒక్క పైసా సాయం చేయలేదని ప్రశ్నించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు కూడా ఒక్క రూపాయి ఇవ్వకపోగా పనులు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. నిరంతర విద్యుత్తు కోసం వేల కోట్లు వెచ్చించి సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, వ్యవస్థను మెరుగుపరుస్తుంటే అణా పైసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫ్లోరైడ్‌ను పారదోలిన మిషన్ భగీరథకు ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం.. నీతి ఆయోగ్ సిఫారసులను బుట్టదాఖలు చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో కుట్రలకు ప్లాన్
తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ రాజగోపాల్‌రెడ్డి పావుగా రాష్ట్రంలో కుట్రలకు తెరలేపిందని మంత్రి విమర్శించారు. పార్టీ మారి ఉప ఎన్నికకు సిద్ధమన్నందుకే రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు అప్పగించిందని విమర్శించారు. మోదీ, అమిత్‌షాలతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ఎన్నోసార్లు పర్యటనకు వస్తున్నా ఒక్క పైసా ఇచ్చేందుకు మనసు రావడం లేదని ఆరోపించారు. అభివృద్ధ్దిలో దేశానికే కాకుండా బీజేపీ పాలిత రాష్ర్టాలకు సైతం తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుండటాన్ని మోదీ, షా ద్వయం జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు.
మునుగోడు ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, వామపక్షాలు కలిసి రావడంతో ఇక్కడ బీజేపీకి స్థానం లేదన్నారు. బీజేపీకి మరోసారి డిపాజిట్ దక్కనివ్వకూడదని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు సీపీఎం, సీపీఐ మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి సొంత అభివృద్ధి కోసమే ఉప ఎన్నికకు సిద్ధపడ్డారని, ఈ ఉప ఎన్నికల వెనక బీజేపీ కుట్ర కోణం దాగి ఉన్నదని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ జిల్లా నేతలు పాల్గొన్నారు.
ప్రచారానికి అనూహ్య స్పందన
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తొలిరోజు ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కొరటికల్ నుంచి ప్రచారం మొదలుకాగా పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఎదురేగి స్వాగతం పలికారు. వందలాది మంది టీఆర్ఎస్తోపాటు సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ప్రచారంలో కదం తొక్కారు.
గులాబీ, ఎర్ర జెండాల రెపరెపల మధ్య మహిళల బోనాలు, కోలాటాలు, డోలు కళకారుల నృత్యాలు, డప్పుల చప్పుళ్లతో సాగిన ప్రచారం అందర్నీ ఆకట్టుకున్నది. గూడపూర్, కల్వలపల్లి, గుండ్లోరిగూడెం గ్రామాల్లోనూ పెద్దసంఖ్యలో టీఆర్ఎస్ ప్రచారంలో ప్రజలు కదం తొక్కారు. ఈ సందర్భంగా కొరటికల్, గూడపూర్ తదితర గ్రామాల్లో పెద్దసంఖ్యలో కాంగ్రెస్, బీజేపీల నుంచి నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మునుగోడు అభివృద్ధే లక్ష్యం
మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని, ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి మరోసారి తనను గెలిపించాలని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో మునుగోడు అభివృద్ధే ఏకైక లక్ష్యంగా పనిచేస్తానన్నారు.