నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి బీజేపీకి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన ఆ రూ. 18 వేల కోట్లు నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇవ్వండి.. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుంటాం.. అందుకు మీరు సిద్ధమేనా అని బీజేపీకి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం, గుజ్జ గ్రామాల్లో జగదీశ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని తేల్చిచెప్పారు. బావులకు మీటర్లు తీసుకువచ్చే దొంగలను గ్రామాల్లోకి రానివ్వొద్దని ప్రజలకు సూచించారు. బీజేపీకి ఓటు వేస్తే బావులకు మీటర్లు పెట్టమని బాండ్ రాసిచ్చినట్లేనని ఆయన పేర్కొన్నారు. మీటర్లు రావొద్దంటే టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయ్యాలని విజ్ఞప్తి చేశారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24గంటల కరెంట్ కోసం కేంద్ర నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ, అమిత్ షాలు ఎందుకు ఒక్క మనిషి కోసం రూ. 18 వేల కోట్లు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. ఆ డబ్బు మాకివ్వండి పోటీ నుండి స్వచ్ఛందంగా తప్పుకుంటామని స్పష్టం చేశారు. నామినేషన్ విత్ డ్రాకు ఇంకా 3 రోజుల సమయం ఉంది. దమ్ముంటే మా సవాల్‌ను స్వీకరించాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
మోదీ హయాంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టేందుకు, విద్యుత్ , వ్యవసాయ చట్టాలకు కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ తరహా పథకాల అమలు కోసం తన సొంత రాష్ట్రంలో ప్రజల నుండి వస్తున్న డిమాండ్‌తోనే కేసీఆర్‌పై మోదీ కోపం పెంచుకున్నారని మంత్రి పేర్కొన్నారు.