హైదరాబాద్, జులై 11 (నమస్తే తెలంగాణ): రద్దుల కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు మరోసారి రద్దు చేస్తారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్తుకు మంగళంపాడినట్టేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. మం గళవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్యయాదవ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతులకు 3 గంటల ఉచిత కరెంట్ ఇస్తే సరిపోతుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 24 గంటల ఉచిత విద్యుత్తుతో రైతులు వెలుగుల్లో ఉండటం రేవంత్‌కు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాకముందు పంటల కోసం కరెంట్ అడిగిన రైతులను రేవంత్ గురువు చంద్రబాబు బషీర్‌భాగ్‌లో పిట్టల్లా కాల్చిచంపితే, ఇప్పుడు రేవంత్ రైతులకు ఉచిత విద్యుత్తు అక్కర్లేదని ప్రకటించారని విమర్శించారు. రైతులు బాగుపడటం రేవంత్‌కు, కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే సాగుకు ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినట్టేనని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రైతాంగానికి 3 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ప్రకటించి రైతులకు ఉచిత కరెంట్‌ను ఎత్తివేసే కుట్రలకు తెరతీశామని చెప్పకనే చెప్పారని పేర్కొన్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ము మ్మాటికీ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్గానే చూడా ల్సి వస్తుందని చెప్పారు. ప్రజలు పొరపాటున రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ పాము, తేలు కాట్లకు బలికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదా లో రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలు అని, అదే పార్టీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే దామరచర్ల వద్ద నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ రద్దు చేస్తామని ఇష్టమొచ్చినట్టుగా చెప్తున్నారని మండిపడ్డారు. రైతాంగ సమస్యపై కనీస అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న ఇటువంటి రద్దుగాళ్లను ప్రజలే గతంలో రద్దు చేశారని, మరోసారి కాంగ్రెస్ పార్టీని రద్దు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఒకసారి రద్దుచేసినా కాంగ్రెస్ నేతలకు గుణపాఠం రాలేదన్నారు.
కేసీఆర్‌తో ప్రజలు టచ్‌లో ఉన్నారు
తెలంగాణ ప్రజలు, ఆ ప్రజలకు సేవ చేయాలని తపించేవారంతా బీఆర్ఎస్ పార్టీతో, సీఎం కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ నేతలు ఎవరికీ టచ్‌లో లేరని, యావత్ తెలంగాణ సమూహం బీఆర్ఎస్తో, కేసీఆర్‌తో టచ్‌లోనే ఉన్నారని చెప్పారు. తమతో బీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం కాంగ్రెస్ నేతల మైండ్ గేమ్‌లో భాగమేనని చెప్పారు. ఉచిత విద్యుత్తును ఎగతాళి చేసిన చంద్రబాబు ఏపీకి వెళ్లిపోయినా ఆయన నీడలు రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రూపంలో శాపగ్రస్తంగా వెంటాడుతున్నాయని దుయ్యబట్టారు. విద్యుత్తు తీగలు బట్టలు ఆరేసేందుకే అన్న బాబు మాటలు నిజం చేసేందుకు ఆయన అనుంగు అనుచరుడు రేవంత్ పాట్లు పడుతున్నారని చెప్పారు. రేవంత్ ప్రకటన, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.