Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధికి దశాబ్ది ఉత్సవాలే నిలువెత్తు తార్కాణమని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అధికారిక లెక్కలు జరిగిన అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన విద్యా దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన గడిచిన తొమ్మిదేళ్ల వ్యవధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యారంగంలో సాధించిన విజయాలను ఆయన గణాంకాలతో సహా సోదాహరణంగా వివరించారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగానే స్పందించారు. తొమ్మిదేళ్ల వ్యవధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని నిరూపిస్తే కాంగ్రెస్ నేతలు ముక్కులు నేలకు రాస్తారా? అంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ముక్కులు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే క్షమాపణ చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.