మోదీ పనుల ప్రధానికాదని, పన్నుల ప్రధాని అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. తల్లి పాలపై మినహా అన్నింటి మీద జీఎస్టీ వేశారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో ఆదివారం సాయంత్రం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు.
వ్యాపారాలు, కాంట్రాక్టులు ఆయన వ్యాపకం అని, అందుకే నియోజకవర్గానికి రాలేక పోతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కల్యాణలక్ష్మీ/షాదీముబారక్ చెక్కులను కుడా పంపిణీ చేసే సమయం ఆయనకు లేదన్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగి పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. అబద్దాలు ఆడడంలో రాజగోపాల్‌రెడ్డి దిట్ట అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని మోసకారి పార్టీగా ప్రజలు గుర్తించారని, అందుకే ప్రజలు గులాబీగూటికి క్యూ కడుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల నిర్లక్ష్యంతో ఫ్లోరోసిస్ పెరిగిందన్నారు.
అంతకు ముందు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేశారు. అలాగే, రూ. 50వేలు విలువ చేసే రిమోట్ వీల్ చైర్‌ను మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండలం గట్ల మల్లెపల్లి గ్రామానికి చెందిన మల్గిరెడ్డి అచ్యుత్‌రెడ్డి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, నాంపల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.