మక్తల్, ఫిబ్రవరి 8 : బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని మంత్రి వాకిటి శ్రీహరి గారడీ మాటలతో కాంగ్రెస్ హయాంలో చేసినట్లు మభ్యపెడుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మక్తల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడితే మంత్రి వాకిటి శ్రీహరి కమలహాసన్ కంటే గొప్పనటుడిగా పట్టణ ప్రజలను మోసం చేసేందుకు మక్తల్ అభివృద్ధి చేపట్టిందంతా తమ ప్రభుత్వంలోనే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటైన విషయమన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఎన్ని జిమ్మికులు చేసినా మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓట్లు పడే అవకాశం లేదని పేరొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని మున్సిపాలిటీపై గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అలాగే మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం సతీమణి, నారాయణపేట మాజీ జిల్లా రైతు బంధు సమితి సభ్యురాలు చిట్టెం సుచరితరెడ్డి, చిట్టెం చాణిక్య రెడ్డి పలు వార్డుల్లో అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మైపాల్‌రెడ్డి, ఆశ రెడ్డి, జుబేర్ భాషా, గోవర్ధన్‌రెడ్డి, ఈశ్వర్, ఆనంద్, నర్సింహలతోపాటు కార్యకర్తలు ఉన్నారు.