హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డికి ఎంత కండ్ల మంట ఉందో అర్థమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు చూస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు లేక రైతులు అరిగోసపడ్డారని, స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన నిరంతర కరెంట్ సరఫరాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతులను మళ్లీ చీకట్లోకి నెట్టేసే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు.
మొదటి నుంచి కాంగ్రెస్కు రైతులంటే చిన్నచూపని, మొన్న ధరణి వద్దన్నారని, ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని అర్ధమవుతుందని వ్యాఖ్యనించారు. ఇప్పుడు ధరణి వద్దని, వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలన్న రేవంత్ రెడ్డి.. రేపు రైతుబంధు, రైతు బీమా కూడా వద్దంటారని ధ్వజమెత్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పి బంగాళఖాతంలో కలపాలని తెలంగాణ రైతాంగానికి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం, ప్రజలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.