Minister Indrakaran Reddy | నిర్మల్ : ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha )కు ఈడీ నోటీసులపై( ED Notice ) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. నిర్మల్( Nirmal )లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర సంస్థల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని ద్వజమెత్తారు.
చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు( Women Reservations ) కోరుతూ ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్( Jantar Mantar ) వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయాలని నిర్ణయించారని, ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేయడం బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, సీఎం కేసీఆర్ ఎవరికీ తల వంచె రకం కాదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతున్నందుకే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాల నాయకులను టార్గెట్ గా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలచే దాడులు చేపిస్తుందని, మరి బీజేపీ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని, వారందరూ నీతిమంతులేనా అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు.