హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా, ప్రధాని మోదీకి ఎందుకంత అక్కసని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వశక్తితో ఎదుగుతున్న తెలంగాణపై కావాలనే మోదీ విషం కక్కుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు పట్ల రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలు యావత్ తెలంగాణను కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. విభజన హామీలను నెరవేర్చాల్సింది పోయి, తెలంగాణను కించపరిచేలా మాట్లాడటం సరికాదని సూచించారు. మోదీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతల వైఖరేంటో చెప్పాలని డిమాండ్‌చేశారు.