ఇంద్రవెల్లి : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సంభవిస్తున్నాయని, అయినా కేంద్రం ఎలాంటి సహాయం అందించడం లేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోపించారు. వరదలతో రూ.1400కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసి.. తక్షణ సహాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరినా.. ఇప్పటి వరకు ఉలుకూ పలుకు లేదంటూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. నాలుగేండ్లలో వివిధ రాష్ట్రాలకు వరద సహాయం అందించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం రూపాయి ఇవ్వలేదన్నారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్రాలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి.. పాలు, పప్పు, ఉప్పులపై జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై పన్నుల భారం మోపుతుందని ధ్వజమెత్తారు. తక్షణమే రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.