Indrakaran Reddy | నిర్మల్ : రాజకీయంగా లబ్ధి పొందేందుకే బీజేపీ పార్టీ ప్రశ్నపత్రాలను లీక్ చేసే పథకానికి తెర లేపిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలో బండి సంజయ్ దిష్టి బొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయటపడిందన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా ఇతర బీజేపీ నేతలకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్లో ఇదంతా జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎ పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా తెలంగాణలో ఈ విధంగా పేపర్ లీకేజీల ఘటనలు జరగలేదు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో తెలంగాణలో ఏదో ఒక అలజడి సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందన్నారు. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ , నిన్న పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణంపై నిష్పక్షపాత దర్యాఫ్తు కొనసాగుతోంది. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు.