హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ శతాబ్దంలో తెలంగాణ సాధించిన అద్భుత విజయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం సీఎం కేసీఆర్ పాలమూరులో వెట్న్‌న్రు ప్రారంభించిన సందర్భంగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ, కుట్రలను ఛేదిస్తూ, కేసులను గెలుస్తూ.. కృష్ణమ్మ నీళ్లు తెచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ‘దశాబ్దాల కల, తరతరాల ఎదురుచూపులు.. అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది.. నెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు కృష్ణమ్మ పైకెగసి రానున్నది. ఉమ్మడి పాలనలో పాలమూరులో కరువు కాటకాలు, ఆకలి కేకలు, వలస బతుకులు. ఒక మాటలో చెప్పాలంటే జీవనవిధ్వంసం.. నాడు పాలకులు మారినా పాలమూరు బతుకులు మాత్రం మారలేదు. తాగు, సాగునీటికి తండ్లా ట తప్పలేదు.. కానీ, పదేండ్ల స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ సారథ్యంలో పాలమూరు దశదిశ మారింది.. నదీజలాలు ఎదురెకుతూ.. చెరువులు తడలుగొడుతూ.. వాగులు జాలువారుతూ.. ఎండిన చేల దాహం తీర్చుతున్నా యి. పచ్చదనాన్ని పరుస్తున్నాయి’ అంటూ రాసుకొచ్చారు. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తితో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండటం గొప్ప విషయం.. ఇది తెలంగాణ సాధించిన ఈ శతాబ్దపు అద్భుత విజయం.. సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైన పాలమూరు జల విజయం’.. అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.