సిద్దిపేట : సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసిన ఎండా కాలమే.. స్వరాష్ట్రంలో ఏ కాలం చూసిన వర్షాకాలమే చూసినట్టుంది అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు, భవిష్యత్తు ప్రజల అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణం చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు ప్రసంగించారు.
మల్లన్న సాగర్ తక్కువ కాలంలోనే పూర్తి చేసుకున్నం అంటే దాని వెనుకాల సీఎం కేసీఆర్ కృషి ఉంది. ఇవాళ ఒక శుభదినం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మన తెలంగాణకే తలమానికం. బుధవారం మల్లన్న దేవుడు పుట్టిన రోజు. ఇవాళ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు కానే కాదు.. నీళ్లు రానే రావు అని ప్రతిపక్షాలు కుట్రలు చేశారు. ఈ ప్రాజెక్టును ఆపాలని సుప్రీం, హైకోర్టుతో పాటు గ్రీన్ ట్రిబ్యునల్‌లో 350 కేసులు వేశారు. సుప్రీంకోర్టు నాలుగేండ్ల క్రితం అన్ని కేసులను కొట్టేస్తూ ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది.
మల్లన్న సాగర్ జలాశయం ద్వారా సగం తెలంగాణకు నీళ్లు వస్తాయి. కరువు ఇక ఉండనే ఉండదు. ఈ ప్రాంతం ఒక్కప్పుడు కరువు కాటకాలకు నిలయం. అంబలి కేంద్రాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశ్యామలం చేశారు కేసీఆర్. ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడిగా.. వందేండ్ల భవిష్యత్ ఆలోచించి ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్‌ను కేసీఆర్ నిర్మించారు. భారత దేశంలోనే నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం మల్లన్న సాగర్. నదికి కొత్త నడక నేర్పారు. గతంలో ఈ ప్రాంతం వానాకాలం కూడా ఎండకాలం లాగే ఉండేది. ఇప్పుడు ఏ కాలమైనా వానాకాలం లాగే ఉంది. మండుటెండల్లో కూడా చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. చెక్ డ్యామ్‌లు నీటితో కళకళలాడుతున్నాయి. సుజల దృశ్యం చూస్తుంటే…. జన్మ ధన్యం అయినట్లు అనిపిస్తుంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.