Breakfasts | అల్పాహారం రోజులో ఎంతో ముఖ్యమైన భోజనం అని చెప్పవచ్చు. మనం రోజంతా ఉత్సాహంగా ఉండడానికి, రోజంతా అలసట లేకుండా పని చేసుకోవడానికి, మన రోజు సంతోషంగా గడవడానికి అల్పాహారం తీసుకోవడం చాలా అవసరం. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఆహారాన్ని తీసుకున్నా లేదా తీసుకోకపోయినా అల్పాహారం విషయంలో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతుంటారు. అలాగే మనం తీసుకునే అల్పాహారం మన ఆరోగ్యానికి శక్తిని, పోషకాలను అందించేదిగా ఉండాలని కూడా వారు చెబుతూ ఉంటారు. అయితే మనం తీసుకునే కొన్ని అల్పాహారాలు గుండె ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. గుండెపోటుతో పాటు ఇతర గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సులభంగా, వేగంగా తయారు చేసుకోదగిన కొన్ని అల్పాహారాలు దీర్ఘకాలిక గుండె ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను ఎక్కువగా పెంచే కొన్ని అల్పాహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెరతో నిండిన కార్న్‌ఫ్లేక్స్ వంటి వాటిని చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిని తయారు చేయడం చాలా సులభమైనది కనుక ఉదయం పూట బిజీగా ఉండే వారు వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కార్న్‌ఫ్లేక్స్ వంటివి శుద్ధి చేసిన చక్కెరతో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డోనట్స్, క్రోసెంట్స్, మఫిన్లు వంటి వాటిని కూడా అల్పాహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. ఇవి రుచిగా ఉండడం వల్ల సరైన అల్పాహార ఎంపికగా చాలా మంది భావిస్తారు. కానీ ఇవి శుద్ది చేసిన పిండి ( మైదా), ట్రాన్స్ ఫ్యాట్స్ తో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చెడుకొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడంతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
ఉదయం పూట అల్పాహారంలో భాగంగా చాలా మంది పూరీలను తింటూ ఉంటారు. వీటిలో సంతృప్త కొవ్వులు, సోడియం వంటివి ఎక్కువగా ఉంటాయి. పూరీలను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఇక చాలా మంది అల్పాహారంలో ఒక కప్పు ఫుల్ ఫ్యాట్ మిల్క్, చీజ్ లేదా ఫుల్ ఫ్యాట్ క్రీమ్ వంటివి వాటిని కాఫీతో కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ వాటిలో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. బ్రెడ్ ను కూడా చాలా మంది అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. బ్రెడ్ తో రకరకాల వంటకాలు చేసి పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు. బ్రెడ్ ను శుద్ది చేసిన పిండితో తయారు చేస్తారు. కనుక దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా బ్రెడ్ లో పోషకాలు తక్కువగా ఉంటాయి. కానీ క్యాలరీలను, కార్బొహైడ్రేట్స్ ను మాత్రం అధికంగా అందిస్తాయి.
అలాగే చాలా మంది ప్రయాణాల్లో సులభంగా ఉంటుందని ప్రీ ప్యాక్డ్ బ్రేక్‌ఫాస్ట్ బార్స్ ను తీసుకుంటూ ఉంటారు. ఇవి ప్రయాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వీటిలో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, కృత్రిమ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కనుక వీటిని తీసుకోకపోవడం మంచిది. ఉదయం పూట సమయం తక్కువగా ఉంటుందని చాలా మంది త్వరగా అయ్యే అల్పాహారాలను తీసుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది రుచిని దృష్టిలో పెట్టుకుని నూనెలో వేయించిన అల్పాహారాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంతో పాటు మన గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కనుక మనం తీసుకునే అల్పాహారం మన ఆరోగ్యానికి మేలు చేసేదిగా అయి ఉండాలని, శరీరానికి రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తిని, పోషకాలను అందించేదిగా ఉండాలని వైద్యులు తెలియజేస్తున్నారు.