భోపాల్: ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన నవజాత ఆడ శిశువు చనిపోయింది. ఆ బిడ్డను గొంతునొక్కి హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లి, ఆసుపత్రిలో ఉన్న అమ్మమ్మపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిపై విచారణ జరుపుతున్నారు. (Newborn girl strangled) మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చందేరీలోని సక్రా గ్రామానికి చెందిన భావన, కాన్పు కోసం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్న ఆమె అక్టోబర్ 2న రాత్రి వేళ మూడోసారి కూడా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆ శిశువును స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)లో చేర్చారు.
కాగా, శనివారం మధ్యాహ్నం శిశువుకు పాలు ఇచ్చిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తల్లి భావన అక్కడి డాక్టర్లకు చెప్పింది. ఒక రోజు ఆడ బిడ్డను డాక్టర్లు పరిశీలించగా మెడ చుట్టూ ముదురు నీలం, ఎరుపు రంగు గుర్తులు, నోటి నుంచి రక్తం రావడం గమనించారు. ఆ బిడ్డ మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ శిశువును గొంతు నులిమి చంపినట్లు పోస్ట్‌మార్టం నివేదిక ధృవీకరించింది. దీంతో ఇది హత్యగా తేలింది.
మరోవైపు ఈ సంఘటన జరిగిన సమయంలో ఎస్ఎన్సీయూ వార్డులో శిశువు దగ్గర ఆమె తల్లి, అమ్మమ్మ మాత్రమే ఉన్నారు. అపరిచిత వ్యక్తి ఎవరూ కూడా వార్డులోకి ప్రవేశించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో శిశువు తల్లి భావన, అమ్మమ్మలను పోలీసులు అనుమానిస్తున్నారు. మూడోసారి ఆడ బిడ్డ పుట్టిన నేపథ్యంలో గొంతునొక్కి చంపి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఎస్ఎన్సీయూ వార్డులో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో ఆసుపత్రి కారిడార్లు, పరిసర ప్రాంతాల్లోని కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నవజాత శిశువు మరణానికి బాధ్యులైన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.