సంగారెడ్డి, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండి, రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆయా రాష్ర్టాల్లో తెలంగాణ తరహాలో ఎలాంటి అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలు జరగటం లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేస్తుంటే బీజేపీ సర్కార్ పన్నులు వేస్తున్నదని విమర్శించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక వర్గంలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు.
నియోజకవర్గంలో రూ.156.32 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దిగ్వాల్లో 88 డబుల్ బెడ్రూం ఇండ్లు, జహీరాబాద్ పట్టణంలోని రహమత్‌నగర్‌లో కేసీఆర్ ఎన్‌క్లేవ్‌లో నిర్మించిన 312 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన రూ.2 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్పుకునే కర్ణాటకలో కరెంటు, తాగునీరు, సాగునీరు, మెరుగైన వైద్యసేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తే.. సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం 50 వేల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను తొలిగించడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థలను మూసివేస్తున్నదని చెప్పారు. సంగారెడ్డిలోని ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ భూములను అమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో 91 వేల ఉద్యోగ నియామకాలు జరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రెండు రోజుల్లో 950 మంది కొత్త డాక్టర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలపై పన్నుల భారం వేస్తే సీఎం కేసీఆర్ పేదల కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు. పనులు చేసేది ఎవరు? పన్నులు వేసేది ఎవరు అన్నది ప్రజలు గుర్తించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నదని తెలిపారు. పేదల కోసం పనిచేసే కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని, ప్రేమించి దీవించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లోని నా ఇల్లులాగే ఉన్నది
హైదరాబాద్‌లో తాను నివాసం ఉండే గేటెడ్ కమ్యూనిటీ లాగే దిగ్వాల్, జహీరాబాద్‌లోని డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దిగ్వాల్, జహీరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభం
సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్‌లోని డబుల్ బెడ్రూం ఇండ్లలో తమకు ఒక ఇల్లు ఉంటే బాగుండేది అని అందరూ అనుకునేలా కేసీఆర్ ఎన్క్లేవ్ ఉన్నదని తెలిపారు. జహీరాబాద్‌లో 312 మంది
లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం సంతోషంగా ఉన్నదని అన్నారు. లబ్ధిదారుల సందడి చూస్తుంటే ఒకే రోజు దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలు చేసుకున్నట్టుగా ఉన్నదని మంత్రి చమత్కరించారు.
కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.