ఒకప్పుడు
డాక్టర్ చదవాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి..
వైద్యం చేయించుకోవటానికి లక్షలుండాలి..
అందుకు హైదరాబాద్ దాకా పోవాలి..
గోసలు పడాలి, బాధలు అనుభవించాలి..
ఇప్పుడు
జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చింది..
దాంతో డాక్టర్ చదువు దగ్గరైంది..
ప్రజలకు ఉచిత వైద్యం చేరువైంది..
రోగానికి పట్నం పోయే గోస తప్పింది..
పేదల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత. ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడం. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు వచ్చినా, వైరస్లు వచ్చినా ప్రజలకు రక్షణగా ఉండే గొప్ప వైద్య కవచాన్ని విద్యార్థుల రూపంలో అందించాలనే లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అనే బృహత్ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాం.
– సీఎం కేసీఆర్
(నిరుడు నవంబర్‌లో 8 మెడికల్ కాలేజీల్లో తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా)
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): సాధారణంగా విద్యాసంస్థలు పాఠా లు మాత్రమే చెప్తాయి.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి. కానీ మెడికల్ కాలేజీలు మాత్రం పూర్తి భిన్నం. వైద్యవిద్యతో విద్యార్థుల జీవితానికి ఓ ఆధారాన్ని ఇవ్వడంతోపాటు, సమాజానికి ఎంతో మంది డాక్టర్లను అందిస్తుంది. పేదలకు స్పెషాలిటీ సేవలు అందించే దవాఖానగా మారి ఎంతో మందిని బతికు ఇస్తుంది. జిల్లా దవాఖాన మెడికల్ కాలేజీగా మారితే పడకలు, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది.. చివరికి పారిశుద్ధ్య కార్మికుల వరకు నియామకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. పరోక్ష ఉపాధి సైతం పెరుగుతుంది. ఒక్క మాటలో.. అటు విద్యార్థులకు, ఇటు ప్రజలకు బతుకునిచ్చే బడి.. మెడికల్ కాలేజీ. ఈ రెండు లక్ష్యాలు నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు దఫాల్లో కలిపి 21 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. తాజాగా మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వటంతో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది.
మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఆ జిల్లా ప్రజలకు వైద్యసేవలు విస్తృతం అవుతాయి. మెడికల్ కాలేజీలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు, అత్యాధునిక పరికరాలు ఉంటాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, సీనియర్ రెసిండెంట్లు.. ఇలా భారీగా సిబ్బంది ఉంటారు. దీంతో ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తుంది. పెద్ద వ్యాధి వచ్చినా హైదరాబాద్ వరకు పరుగెత్తాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే చికిత్స లభిస్తుంది. జిల్లాల వికేంద్రీకరణ నేపథ్యంలో మారుమూల గ్రామాలకు సైతం జిల్లా కేంద్రాలు గరిష్ఠంగా 50-70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. కాబట్టి అత్యవసర సమయాల్లో వేగంగా పెద్ద దవాఖానకు చేరుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీహెచ్‌సీల్లో 8 విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయి. ఏరియా హాస్పిటళ్లలో 14 విభాగాలు సేవలు అందిస్తాయి. జిల్లా దవాఖానల్లో 22 విభాగాలు సేవలు అందిస్తుంటాయి. మెడికల్ కాలేజీల్లో 26-36 విభాగాలు సేవలు అందిస్తుంటాయి.
2014లో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 5, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 850. ఈ ఏడాది తరగతులు ప్రారంభం కానున్న 9 మెడికల్ కాలేజీలతో కలిపితే ప్రస్తుతం రాష్ట్రంలోని కాలేజీలు 26. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3,790. అంటే గతంతో పోల్చితే 2,940 మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ కాలేజీల్లో ఉచితంగా వైద్య విద్య అభ్యసించనున్నారు.
గతంతో పోల్చితే అదనంగా 2,940 మంది విద్యార్థుల డాక్టర్ కల నెరవేరబోతున్నది. తా జాగా అనుమతి ఇచ్చిన 8 కాలేజీలతో మరో 800 సీట్లు అందుబాటులోకి వస్తాయి. అం టే.. ఏటా సుమారు 2,800 మంది విద్యార్థు ల కలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నెరవేర్చబోతున్నాయి. పీజీ సీట్లు కూడా తొమ్మిదేండ్లలో డబుల్ అయ్యాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు పెరిగాయి. డబ్బు ఖర్చు చేసుకొని విదేశాలకు వెళ్లే అవస్థ తప్పుతుంది. ఉక్రెయిన్ వంటి విపత్తుల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి రావటం, చదువును కొనసాగించడానికి నానా కష్టాలు పడాల్సిన దుస్థితి తప్పుతుంది. హాయిగా సొంత రాష్ట్రంలోనే ఉంటూ తమ కలలను నెరవేర్చుకోవచ్చు.
మెడికల్ కాలేజీ అంటే కేవలం విద్యాసంస్థ మాత్రమే కాదు. అనుబంధంగా అనేక వసతులు ఏర్పడుతాయి. ఆ ప్రాంతం ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుంది. కాలేజీ, అనుబంధ దవాఖాన, హాస్టల్లో నియమితులయ్యే వైద్యులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఇతర సిబ్బంది ఇలా సుమారు 1,500-2,000 మంది వరకు అక్కడ ఉంటారు. ఇందు లో అత్యధిక శాతం మంది స్థానికంగా నివాసం ఉంటారు. మరోవైపు సపోర్టింగ్ స్టాఫ్ రూపం లో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికులకు ఉపాధి పెరుగుతుంది. విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది, హాస్పిటల్‌కు వచ్చే రోగులు, సహాయకుల కోసం రవాణా, వసతి సదుపాయాలు, హోటళ్లు, మెడికల్ దుకాణాలు.. ఇలా ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. మెడికల్ కాలేజీలు రియల్ ఎస్టేట్‌కు పెట్టుబడుల ఆకర్షణ కేంద్రాలుగా మారుతాయి. చుట్టుపక్కల భూముల ధరలు కూడా పెరుగుతాయి.
మెడికల్ కాలేజీలతో కలిగే ప్రయోజనాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒక ప్రత్యక్ష ఉదాహరణ. జిల్లాలో గతంలో సుమారు 32 లక్షల జనాభా ఉండేది. నల్లగొండ పట్టణంలో జిల్లా దవాఖాన ఉండేది. దశాబ్దాలుగా అక్కడి ప్రజలకు అదే పెద్ద దిక్కు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి నల్లగొండ జిల్లా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలుగా విడిపోయింది. మూడింటికీ మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. గతంలో 32 లక్షల మందికి ఒక్క పెద్ద దవాఖాన ఉంటే.. ఇప్పుడు 35 లక్షల జనాభాకు మూడు పెద్ద దవాఖానలు సేవలు అందిస్తున్నాయి.
పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తేవటంతోపాటు, తెలంగాణ బిడ్డల డాక్టర్ కలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన సంకల్ప బలం ఫలితంగా తొమ్మిదేండ్లలోనే ఇది కార్యరూపం దాల్చింది. మొదటి దశలో 4 మెడికల్ కాలేజీలు, రెండో దశలో 8 కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యాయి. మూడో దశ లో 9 మెడికల్ కాలేజీలు మంజూరుకాగా, ఈ ఏడాది నుంచి తరగతులు మొదలవుతున్నాయి. మిగతా 8 జిల్లాల్లో వచ్చే ఏడాది కాలేజీలు ప్రారంభం అవుతాయి. తద్వారా దేశంలోనే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఇప్పటికే అనేక జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఫలితాలు కనిపిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల వంటి మారుమూల ప్రాంతాలు సైతం జిల్లాలుగా మారడమే కాదు.. అకడ మెడికల్ కాలేజీలు ఏర్పాటుకావటం గొప్ప విష యం. ఒకవైపు ఎంబీబీఎస్ చదవాలనే ఆశ, మరోవైపు అర్థం కాని భాష, దేశం కాని దేశంలో గోస.. ఇదంతా ఒకనాడు. కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు, లోకల్ రిజర్వేషన్ వల్ల డాక్టర్ కావాలనుకునే తెలంగాణ వి ద్యార్థులకు అపార అవకాశాలు లభించాయి. ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
– హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి