సిద్దిపేట, అక్టోబర్ 17 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నా శ్వాస ఉన్నంత కాలం.. ఈ జన్మ ఉన్నంత కాలం.. సీఎం కేసీఆర్‌కు, ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల దీవెనలతో సిద్దిపేటకు సేవ చేసే అదృష్టం దొరికిందని చెప్పారు. మంగళవారం సిద్దిపేట ప్రజాశీర్వాద సభలో హరీశ్ మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలు తన మీద చూపిన ప్రేమ, అభిమానాలకు చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని అన్నారు. గత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సిద్దిపేట సభకు వచ్చినప్పడు.. ‘మీరు హరీశ్‌ను ఆశ్వీరదించండి. సిద్దిపేట జిల్లా, రైలు, గోదావరి జలాలు ఇస్తాం’ అని కేసీఆర్ మాట ఇచ్చి, నెరవేర్చి మళ్లీ మన ముందుకు వచ్చారని తెలిపారు. తెలంగాణను సాధించటమే కాదు.. మన సిద్దిపేట ప్రజల కలలను సాకారం చేసి, ఈ పురిటి గడ్డ రుణం తీర్చుకున్న సిద్దిపేట మట్టి బిడ్డ మన కేసీఆర్ అని కొనియాడారు.
సభను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఇది ఎన్నికల ప్రచార సభలా లేదు. మన కలలను సాకారం చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేసే సభలా ఉన్నది. సీఎం కేసీఆర్‌కు మరింత శక్తినిచ్చి, దీవెనలిచ్చి, మరింత ఊపునిచ్చే సభలా ఉన్నది. మన సిద్దిపేటకు ట్యాగ్‌లైన్ ఉండేది. నాటి నినాదాలు సిద్దిపేట జిల్లా, నీళ్లు, రైలు ఇవి దశాబ్దాల కలలు.. ఎన్నికల నినాదాలు.. గోడమీద రాతలుగా ఉండేవి. ఈరోజు రైలు, నీళ్లు, జిల్లాను అందించిన మన నాయకుడు కేసీఆర్. కేసీఆర్‌ను కారణజన్ముడు అంటారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఒక సారి మన సీఎం కేసీఆర్‌ను కలిసినప్పుడు.. కొంత మంది కల కంటారు. ఆ కలను నిజం చేసే అదృష్టం కొంతమందికే దక్కుతుంది. మీరు తెలంగాణ రావాలని స్పప్నించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. సాధించిన తెలంగాణను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దే అవకాశం మీకే దక్కింది. అదృష్టవంతులు అని అన్నారు. ఆనాడు ఎమ్మెల్యేగా అప్పటి సీఎం ఎన్టీఆర్‌కు సిద్దిపేట అంబేద్కర్ విగ్రహం వద్ద దరఖాస్తు ఇచ్చిన చేతులతోనే, నేడు జిల్లాను ఏర్పాటు చేశారు కేసీఆర్. ఇంత కంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా? అందుకే ఆయన కారణజన్ముడు’ అని అన్నారు.
‘ఒకనాడు మన ప్రాంతంలో రైతులు భూ ములు అమ్ముకుంటే ఎకరానికి 4 లక్షలు, 5 లక్షలు ఉండే. ఇవ్వాళ సిద్దిపేటలో ఎక్కడపోయిన 50 లక్షలు, కోటి రూపాయలకు ఎకరం అయ్యింది. సీఎం రైతుల గౌరవాన్ని పెంచారు. కేసీఆర్ వల్లే రైతులకు ధైర్యం వచ్చింది’ అని హరీశ్ కొనియాడారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు తాను నీళ్ల మంత్రిగా పనిచేశానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చాలామంది ప్రతిపక్ష నేతలు తాము బతికుండగా నీళ్లను చూస్తామా? అని హేళన చేశారని గుర్తుచేశారు. కానీ చరిత్ర తిరగరాసిన్రు. మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని అన్నారు. నాడు కైకిలు దొరుకుతలేదు బిడ్డా అని అడిగేవాళ్లని, కేసీఆర్ దయ వల్ల ఇయ్యాళ గుట్టలు, రాళ్లు కూడా అచ్చు కట్టినమని, కైకిలోల్లు దొరుకుతలేరని వెల్లడించారు.
‘ఎక్కడో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మగ కూలీలు ఎకరానికి రూ.5 వేలు గుత్తపట్టి నాట్లు వేస్తరని కలగన్నమా? ఒకనాడు గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు, కరువు కాటకాలతో ఇబ్బంది పడ్డ తెలంగాణను ఇయ్యాల పది రాష్ర్టాలకు అన్నం పెట్టే ధాన్యాగారంగా మలిచిన ఘనత కేసీఆర్‌ది కాదా? దేశంలోనే అతి ఎక్కువ వరిధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దింది నిజం కాదా? పదేండ్ల కిందట ఇదే మన సిద్దిపేటలో మనుషులకు తిండిగింజలకు తిప్పలు ఉండే. పశువులకు పశుగ్రాసం లేని పరిస్థితి కూడా చూశాం. నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చిన్నకోడూరు మండలంలో చింత చెట్ల కింద పశుగ్రాసం కేంద్రం పెట్టి పశువులకు గడ్డి తెచ్చి పశువులను బతికించుకున్నం. రాఘవాపూర్ స్టేజీ మీద, నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలో పశుగ్రాస కేంద్రాలు పెట్టి మూగజీవాలను కాపాడుకున్నం. ఇవ్వాళ ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో కోనసీమను తలపించేటట్టు తెలంగాణను, సిద్దిపేటను తీర్చిదిద్దింది నిజం కాదా?’ అని అన్నారు.
కాంగ్రెసోళ్లు ఒక్క చాన్స్ అని అడుగుతున్నారని, కానీ 11 సార్లు చాన్స్ ఇచ్చినా తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకానీ పార్టీ కాంగ్రెస్ అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. 11 సార్లు చాన్స్ ఇచ్చినా వాళ్లు చేయలేని పనిని, తొమ్మిదేండ్లలోపే రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసి చూపారు సీఎం కేసీఆర్ అని అన్నారు. ‘రాజగోపాల్‌పేట పెద్ద చెరువు నిండితే సగం సిద్దిపేట సల్లగా ఉంటుందని అనేవాళ్లు. 30 ఏండ్లకు ఒక్కసారి నిండని రాజగోపాల్‌పేట చెరువు నేడు నిండుకుండలా ఉన్నది. కేసీఆర్ నాయకత్వంలో చెరువులు ఎండంగ చూ డం. సిద్దిపేట డిక్షనరీలో కరువు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించిన బిడ్డ మన కేసీఆర్’ అని చెప్పారు.
సిద్దిపేట పేరును ఆకాశమంత ఎత్తున నిలిపిన వ్యక్తి సీఎం కేసీఆర్.. చరిత్రను ప్రభావితం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్.. కేసీఆర్ వ్యూహం శత్రువులకు అందనిదని కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రేవంతప్పా.. రాజకీయమంటే బ్రీఫ్‌కేసులు మోసినంత ఈజీ కాదని వ్యంగ్యంగా రేవంత్‌రెడ్డిపై సెటైర్ వేశారు. ‘హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్దకు పోయి డబ్బులు, మందు పంచకుండా ఎన్నికల్లో గెలువాలని కేటీఆర్‌కు సవాల్ విసరడం కాదు. కర్ణాటకలో కోట్ల రూపాయలు ఎట్లా దొరుకుతున్నాయి? ముందు దాని గురించి మట్లాడు’ అని సవాల్ విసిరారు. ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టిన, వలస పాలకులకు వంత పాడిన చరిత్ర రేవంత్‌ది అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘టికెట్లు అమ్ముకున్న చరిత్ర రేవంత్‌రెడ్డిది. ప్రజల కోసం పదవులను పదుల సార్లు త్యాగం చేసిన చరిత్ర కేసీఆర్‌ది’ అని తెలిపారు.