Harish Rao | సంగారెడ్డి : దొంగల్ని అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత ఇవాళ ఏ లీక్ లేదు.. పది పరీక్షలు( Tenth Exams ) సాఫీగా సాగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు( Minister Harish rao ) పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ధన్సరి విల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు స్థాపించి పిల్లలకు మంచి చదువు చెప్పిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. చదువేలేమో మనం చెప్పిస్తుంటే.. బీజేపీ నేతలేమో పేపర్లు లీక్ చేస్తున్నారు. మొన్న, నిన్న పేపర్లు లీక్ చేశారు. ఇవాళ దొంగల్ని అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత ఇవాళ ఏ లీక్ లేదు. పది పరీక్షలు సాఫీగా సాగుతున్నాయి. ఎవరైతే పేపర్ లీక్ చేశారో వారిని పోలీసులు దొరికించుకున్నారు. ఆ తర్వాత వారిని జైల్లో వేశారు అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నేతలు ఎన్నో కుట్రలు చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. హిందూ – ముస్లిం గొడవలు పెట్టాలని చూశారు. అది సాధ్యం కాలేదు. తెలంగాణ గవర్నమెంట్‌ను పడగొట్టాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించారు. ఆ దొంగలు దొరికారు. అది కూడా ఫెయిలైంది. అక్కడ కూడా ఫెయిల్ అయ్యామని చెప్పి మనకు పైసలు రాకుండా చేస్తున్నారు. బోర్లకాడ మీటర్లు పెట్టలేదని చెప్పి రూ. 30 వేల కోట్లు ఢిల్లీలో ఆపారు. నాణ్యమైన కరెంట్ కోసం నెలకు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. సీఎం కేసీఆర్ రైతులకు పైసా ఖర్చు లేకుండా కరెంట్ ఇస్తున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
కాంగ్రెస్ నేతలు వస్తే మళ్లీ కాలిపోయే మోటార్లు వస్తాయి. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వస్తాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి ఆగిపోతాయి. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన లాంటి పథకాలను అమలు చేయడం లేదు. రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అయితే కూలగొడుతా.. లేదంటే కాలబెడుతా అని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. వారి మాటలకు జనాలు గందరగోళం కావొద్దు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. సంక్షేమ ప్రభుత్వాన్ని ఆదరించాలి అని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.