Minister Harish Rao | సీఎం కేసీఆర్ పదేండ్లలో కష్టపడి తెలంగాణను పైకి తెచ్చిండు. కైలాసంలో నిచ్చెనలు ఎక్కినట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కించిండు. కరెంట్ బాధలు, మంచినీళ్ల బాధలు లేకుండా, ఎరువులకు తిప్పలు లేకుండా సంక్షేమ, వైద్య రంగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా పోయిండు. మరి తప్పిపోయి కాంగ్రెసోళ్ల చేతులోకి పోతే కైలాసంలో పెద్దపాము మింగినట్టు సక్కగ జారి కింద పడుతం. ఇవాళ మంచిగ మీదికి పోతున్నాం. దీనిని ఇట్లనే ఇంకా పైకి తీసుకుపోవాలి.
-మంత్రి హరీశ్‌రావు
Harishrao
మంచిర్యాల/సంగారెడ్డి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు వంద సీట్లు ఖాయమని, వచ్చేది హంగ్‌లు.. గింగులు కాదని.. కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. బీజేపీకి ఈసారి ఒక్క సీటుకూడా రాదని అన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కేసీఆర్ అంటే ఒక విశ్వాసం.. కాంగ్రెస్ అంటే నయవంచన.. నాటకం అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘ఓడ దాటేదాక ఓడ మల్లప్ప.. ఓడ దాటినంక బోడ మల్లప్ప’ అనే రకం అని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మంచిర్యాల జిల్లా దొనబండ బహిరంగ సభ, చెన్నూర్ అంబేద్కర్ చౌక్‌లో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఝరాసంగం, జహీరాబాద్‌లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కళ్లబొల్లి మాటలు చెప్పి.. అరచేతిలో వైకుంఠం చూపించి.. కర్ణాటక నుంచి డబ్బు సంచులు తెచ్చి ఈ రాష్ట్రంలో గెలువాలని పగటి కలలు కంటున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణలో కాంగ్రెస్ నాటకాలు నడువవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు గ్రూప్‌లు, ముఠా రాజకీయాలతో వాళ్లలో వారే తన్నుకొని పరిపాలనను భ్రష్టు పట్టించారని గుర్తుచేశారు. అధికారం కోసం తమ సొంత పార్టీ ముఖ్యమంత్రులను కుర్చీలోంచి దించి.. ఇంకొకరు కుర్చీ ఎక్కడం కోసం హైదరాబాద్‌లో మతకలాహాలు సృష్టించి, కర్ఫ్యూలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఇవాళ కేసీఆర్ హయాం లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినంక కరువు లేదని, తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ కాలంలో కర్ఫ్యూ అంతకంటే లేదని తెలిపారు.
చెప్పినవన్నీ చేసిచూపిన కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నక్సలైట్లతో చర్చలు అని చెప్పి, ఆ నక్సలైట్లను మట్టు పెట్టింది వాస్తవం కాదా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ పార్టీ ఏ విషయంలో మాట మీద ఉన్నదో చెప్పాలని ప్రశ్నించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 కిలోల బియ్యం, పగటి పూట కరెంట్, తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామని మోసం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక భస్మాసుర హస్తమని, దాన్ని నమ్మితే ఆగమైతమని అన్నారు. కానీ కేసీఆర్ చెప్పిందల్లా చేసి చూపారని చెప్పారు. తెలంగాణ తెస్తా అని తెచ్చి చూపించారని, రైతుబంధు, ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి ఇచ్చి మాట నిలబెట్టుకొన్నారని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంట్ చేసిందని, రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎరువుల బస్తాలు కావాలంటే పోలీస్స్టేషన్ల ముందు లైన్లలో నిల్చొండే దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. మళ్లీ కాంగ్రెసోళ్లు వస్తే కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, పగటిపూట కరెంట్, ఎరువు బస్తాలకు కొరత.. ఇలా అన్నింటికీ గోసపడాల్సిందేనని చెప్పారు.
కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలనకు పొంతన ఉందా?
ఆనాటి పదేండ్ల కాంగ్రెస్ పాలనకు, ఈనాటి పదేండ్ల బీఆర్ఎస్ పాలనకు అసలు పొంతన ఉన్నదా? అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ రెండింటికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని చెప్పారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎరువులు లేవు, కరెంట్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి లేవని పేర్కొన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో మాకు పోటీనా? అని ప్రశ్నించారు. ‘పదేండ్ల కాంగ్రెస్ పాలనపై చర్చ అనేందుకు ఆనాడు నువ్వు ఆ పార్టీలో ఏడున్నవో చెప్పాలి.
అప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ పార్టీని తిట్టావ్. సోనియాగాంధీని బలిదేవత అన్న నీకు ఈ రోజు మాట్లాడే హక్కు ఎక్కడిదో చెప్పాలి. కావాలంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమ్రంతులు, పీసీసీ అధ్యక్షులతో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని రేవంత్‌నుద్దేశించి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రేవంత్ పెడితే పెండ్లి.. పెట్టకుంటే చావుకోరే టైప్ అని చురకలంటించారు. పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో పదేండ్లుగా అధికారంలో ఉండి కూడా ఏం చేయనోళ్లు, తెలంగాణలో చేస్తామంటున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
డిపాజిట్లు దక్కించుకొనే కమిటీ వేయ్!
సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీని గెలిపించుకోని జేపీ నడ్డా.. తెలంగాణకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘జేపీ నడ్డా.. తెలంగాణ కేసీఆర్ అడ్డా అని గుర్తుపెట్టుకో’ అని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ డకౌట్ ఖాయమని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జీజేపీ ఒక్క చోటే గెలిచిందని, ఈ సారి ఆ ఒక్కటి కూడా రాదని అన్నారు. ఏవేవో కమిటీలు వేస్తున్న నడ్డా.. డిపాజిట్ దక్కించుకొనే కమిటీ వేసుకో అని చురకలంటించారు. నడ్డా వేసిన చేరికల కమిటీ అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేవారు. ‘బీజేపీ నుంచి బీఎల్ సంతోష్ అనే ఆయన వచ్చి ఈ రాష్ట్రంలో హంగ్ వస్తది అంటుండు. మిస్టర్ సంతోష్.. ఈ రాష్ట్రంలో హంగ్ కాదు.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడ్తది’ అని స్పష్టం చేశారు.
గుజరాత్ కంటే తెలంగాణ పాలన నూరుపాళ్లు నయమని పేర్కొన్నారు. గుజరాత్లో రూ.600 పింఛన్ ఇస్తే, తెలంగాణలో కేసీఆర్ రూ.2వేలు ఇస్తున్నారని చెప్పారు. గుజరాత్లో వ్యవసాయానికి కరెంట్ ఇచ్చి బిల్లులు వసూలు చేస్తుంటే.. తెలంగాణలో రూపాయి బిల్లు లేకుండా కేసీఆర్ 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ అందిస్తున్నారని తెలిపారు. మరోసారి సీఎంగా కేసీఆర్‌ను గెలిపించుకొని రాష్ర్టాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ దండె విఠల్, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మె ల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Trs
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రూ. 2 వేల పింఛన్ ఇస్తున్నడా? లేదా?.. కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.లక్ష ఇస్తున్నడా? లేదా? రైతుబంధు ఎకరానికి రూ.4వేలు ఉండే.. మళ్లీ గెలిస్తే రూ.5వేలు చేస్తా అన్నడు. చేసిండా? లేదా? ఇట్లా ఇచ్చిన ప్రతిమాటా నెరవేర్చిండు. త్వరలోనే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యే మ్యానిఫెస్టో మీ ముందుంటుంది. మూడోసారి ఎలాగూ మనమే గెలుస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుందాం.
-మంత్రి హరీశ్‌రావు
ప్రజల గుండెల్లో కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా తెచ్చుకోవటమే ఎక్కువని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో 80 సీట్లు సాధించారని.. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు సాధించి హ్యాట్రిక్ సీఎం అవుతారని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుబంధు, పింఛన్ డబ్బులను పెంచే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే బ్రహ్మాండమైన మ్యానిఫెస్టో విడుదల చేస్తారని చెప్పారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్పుడు మాటలను నమ్మవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్‌రావు పక్కా లోకల్ అని, ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఆయననే గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్‌రావు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు దేవిప్రసాద్, మఠం భిక్షపతి, నరోత్తమ్ తదితరులు పాల్గొన్నారు.
మాటలు, మూటలు, ముఠాలు, మంటలు.. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. కాంగ్రెస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాయమాటలు- ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, మూటలు -కర్ణాటక నుంచి డబ్బు సంచులు తెచ్చి తెలంగాణ ఓట్లు కొంటారట, ముఠాలు- కొట్లాడుకునే గ్రూపుల సంస్కృతి.. ఒకని కాలు పట్టి ఒకడు వాళ్లే గుంజుకుంటరు, మంటలు-ముఖ్యమంత్రి పదవి దించడానికి మతంమంటలు పెడుతారు.
– మంత్రి హరీశ్‌రావు
వెస్టిండిస్లా కాంగ్రెస్ పరిస్థితి!
ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ నడస్తున్న దృష్ట్యా.. క్రికెట్ భాషలో చెప్పాలంటే.. రాష్ట్రంలో ఎన్నికలు ఏ రోజు జరిగినా బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్ ఖాయమని, కేసీఆర్ సెంచరీ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు లేని రన్ కోసం ఉరికి రనౌట్ అయితే, బీజేపీ వాళ్లు ఇప్పుడున్న ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవక డకౌట్ అవుతారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా 100 సీట్లతో కేసీఆర్ సెంచరీ కొడతారని ధీమా వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వెస్టిండిస్ టీమ్‌లా తయారైందని ఎద్దేవా చేశారు. గతంలో ఎప్పుడు వరల్డ్‌కప్ వచ్చినా ఆ టీమే గెలుస్తుండే కానీ ఇప్పుడు వరల్డ్ కప్ ఆడేందుకు అర్హత కూడా సాధించలేకపోయిందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉన్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకోవాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. ‘కర్ణాటకలో లంచాలు తీసుకున్న అవినీతి సొమ్ము తెచ్చి తెలంగాణలో పంచి గెలువాలని పగటి కలలు కంటున్నరు. బిడ్డా ఇది తెలంగాణ.. ఉద్యమాల గడ్డ.. నీ పైసలు ఇక్కడ నడవయ్’ అని కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.