Minister Harish Rao | కాంగ్రెస్ నమ్మితే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని.. కాంగ్రెస్ ఓ జూటాపార్టీ అంటూ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూ.18.23 కోట్లతో కంగ్టి నుంచి కర్ణాటక బార్డర్ బార్డర్ వరకు రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ మాట మార్చిందని.. గెలిస్తే మహిళలకు ఉచిత బస్ అని చెప్పి.. బంద్ చేశారన్నారు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు.
కర్ణాటకలో ఇక్కడ అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు లేవని.. ఇక్కడికి వచ్చి ఉద్దరిస్తామంటున్నారంటూ విమర్శించారు. తండా తండాకు నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని, గల్లీ గల్లీలో బారాన మందం రోడ్లు వేశామన్నారు. సీఎం కేసీఆర్ రైతు గౌరవాన్ని పెంచారని, అందుకే తెలంగాణలో భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. కర్ణాటకలో దిక్కు లేదని, ఈసారి భూపాల్ రెడ్డి గెలిస్తే బసవేశ్వర ప్రాజెక్ట్ ద్వారా మీ ఇంటి ముందుకు నీళ్లు తెస్తామన్నారు. 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తాగేందుకు నీరు ఇవ్వలేదని, తాము తాగునీటితో పాటు సాగునీటిని సైతం అందిస్తామన్నారు.