నమస్తే తెలంగాణ నెట్వర్క్: తెలంగాణకు వచ్చి నీతులు చెప్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సొంత ఊరిలోనే మంచినీళ్లకు దిక్కులేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. కర్ణాటకకు చెందిన ఖర్గే సొంత ఊరిలో కరెంటు కూడా లేదని చెప్పారు. ఇక్కడికి వచ్చి నీతులు చెప్పేకంటే, బీఆర్ఎస్ పాలన చూసి నేర్చుకొని పోవాలని చురక అంటించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని ఖర్గే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, ఎల్లారెడ్డిలో రోడ్‌షోల్లో, రేడియో మిర్చి(ఎఫ్ఎం) ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని తెలిపారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని, అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో తెచ్చుకుందామా? అని ప్రజలను అడిగారు.
మాట మీద నిల్చోని కాంగ్రెస్‌ను నమ్మి రిస్క్‌లో పడదామా? లేక ప్రజలకు మంచి పాలన అందిస్తున్న తెలంగాణ గాంధీ కేసీఆర్‌ను గెలిపించుకుందామా? అని అన్నారు. కర్ణాటకలో మూడు గంటల కరెంటే ఇస్తున్నారని, దీంతో అక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ 5 గ్యారెంటీలపై ఊదరగొట్టారని, వారిని నమ్మి అక్కడి రైతులు నిండా మోసపోయారని తెలిపారు. మూడు గంటల కరెంట్, 10 హెచ్‌పీ మోటర్ల కాంగ్రెస్‌ను నమ్మి మోసపోదామా? 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలనను కాదని రిస్క్ తీసుకుందామా? అని ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండుగ అన్నారని, కానీ.. కేసీఆర్ వచ్చాక వ్యవసాయం పండుగ అయ్యిందని అన్నారు. తెలంగాణ రైతులు పది రాష్ర్టాలకు అన్నదాతలుగా మారారని వెల్లడించారు.
ఓటు వేసేముందు ఆలోచించి వేయాలని, నమ్మకానికి మారుపేరైన కేసీఆర్‌ను మరోసారి దీవించాలని ప్రజలను హరీశ్ కోరారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని, కాయితీ లంబాడీల సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ‘బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.16 వేలు రైతుబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్తుండు. మరి కాంగ్రెసోళ్లేమో రైతుకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తమంటున్నరు. కాంగ్రెసోళ్ల కాయిదం జర జాగ్రత్తగా చదువుర్రి’ అని సూచించారు. కార్యక్రమాల్లో ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జాజాల సురేందర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌గౌడ్, విజయపాల్‌రెడ్డి, వేలమంది ప్రజలు పాల్గొన్నారు. కాగా, హరీశ్‌రావు రోడ్‌షోలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. రోడ్షోలన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. దీనిన చూసిన మంత్రి.. ఇదే ఉత్సాహాన్ని 30వ తేదీ వరకు కొనసాగించాలని అన్నారు.
కట్క వేస్తే వచ్చే కరెంట్ కావాలా? కటిక చీకటి కర్ణాటక లాంటి బతుకు కావాలా? ప్రజలే తేల్చాలి.
– మంత్రి హరీశ్‌రావు
ఓవైపు చిరుజల్లులు.. మరోవైపు శీతల గాలులు ఉన్నా లెక్కచేయకుండా మంత్రి హరీశ్‌రావు రోడ్‌షోకు ప్రజలు పోటెత్తారు. శుక్రవారం రాత్రి సిద్దిపేట జిల్లా నంగునూరులో హరీశ్‌రావు రోడ్‌షో నిర్వహించారు. దీనికి ప్రజలు భారీగా తరలివచ్చారు. వర్షం పడుతున్నా రోడ్లపై నిల్చొని, డాబాల పైకెక్కి హరీశ్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నంగునూరు అంటేనే తనకు ఎంతో నమ్మకం, భరోసా అని అన్నారు. సీఎం కేసీఆర్‌కు సైతం నంగునూరు మండల కోనాయిపల్లి వేంకటేశ్వరాలయం సెంటిమెంట్ అని తెలిపారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ దొంగరాత్రి కరెంట్ వస్తుందని, రిస్క్ వద్దని, మళ్లీ కారుకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, రాష్ట్ర ఆయిల్‌పామ్ వెల్ఫేర్ సొసైటీ వైస్ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్‌గౌడ్‌కు పెద్దషాక్ తగిలింది. శుక్రవారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో ఆయన అన్నావదిన కాట రాజేశ్‌గౌడ్, కాట సునీత బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. సొంత అన్నావదినను మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం మేలు చేస్తాడని కాట శ్రీనివాస్‌గౌడ్‌పై మండిపడ్డారు. తమకు రావాల్సిన ఆస్తులను అమ్ముకుంటూ మోసం చేశాడని ఆరోపించారు.
గతంలో వ్యవసాయం చేసేవారికి పిల్లనిచ్చే వారు కాదు. ప్రస్తుతం కేసీఆర్ పాలనలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరెంట్ కష్టాలు పోయాయి. చెరువులు బాగు చేసుకున్నాం. చెక్ డ్యాంలు నిర్మించుకున్నాం. పెట్టుబడి సాయం, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుతున్నాయి. రైతులకు అవసరమైన ప్రతి సదుపాయాన్ని కల్పించాం.
– మంత్రి హరీశ్‌రావు
ఐదేండ్ల రాష్ట్ర భవిష్యత్తు యువత చేతిలో ఉన్నదని, ఆలోచించి ఓటెయ్యాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. సోషల్ మీడియాలో రిల్స్, ఎమోషనల్ వీడియోలకు ఆకర్షితులై ఓటేస్తే, భవిష్యత్తు పెనుప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. శుక్రవారం రేడియో మిర్చి(ఎఫ్ఎం) ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సారి మొదటిసారి ఓటువేసేవారు విజ్ఞతతో ఆలోచించి వేయాలని అన్నారు. బూతు రాజకీయాలు కావాలో, భవిష్యత్తు రాజకీయాలు కావాలో ఆలోచించుకోవాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో నిజాలు తక్కువయ్యాయని, అబద్ధాలు ఎక్కువయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కొందరు యువతను ఆకట్టుకోవచ్చనే ఆలోచనతో తప్పుడు సమాచారాన్ని యువత మెదళ్లలో నాటాలని చూస్తున్నారని, తప్పుడు సమాచారానికి ఆకర్షితులు కావొద్దని సూచించారు. నిజమేమిటో? అబద్ధమేమిటో? తెలియాలంటే.. ఇతర రాష్ర్టాలతో తెలంగాణను పోల్చి చూడాలని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని వివరించారు. పల్లెల నుంచి పట్టణాల వరకు రాష్ట్రమంతా అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. హైదరాబాద్ మార్పు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది నగరాన్ని మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.