పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ చికిత్సలు పెరగాలి
గాంధీ, ఉస్మానియాపై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 18 : గాంధీ, ఉస్మానియా దవాఖానలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా సేవలందించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. కొవిడ్ సోకిన గర్భిణులకు చికిత్స అందించడంలో గాంధీ దవాఖాన ఉత్తమంగా పనిచేసిందని ప్రశంసించారు. ఇందుకు గైనిక్ విభాగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఉస్మానియా, గాంధీ దవాఖానల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్‌కు తీసిపోకుండా చికిత్స అందిస్తున్నామని, రోగులతో ఆప్యాయంగా ఉంటూ వైద్యసేవలు అందిస్తే మరింత మంచి పేరు వస్తుందని చెప్పారు. సిబ్బంది కూడా రోగులు, వారి సహాయకులతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశించారు. అన్నివేళల్లో అత్యవసర వైద్యసేవలు అందాలని స్పష్టంచేశారు. ఆరోగ్యశ్రీ -ఆయుష్మాన్ భారత్ చికిత్సలు మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఇతర రాష్ట్రాల వారికి కూడా ఈ పథకం కింద చిక్సితలు అందించాలని చెప్పారు. కిడ్నీ, మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలు పెరుగాలని సూచించారు. మాతా, శిశు మరణాలు, సాధారణ మరణాలు, సీ సెక్షన్లపై నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. రెండు దవాఖానల్లో చేపట్టిన సివిల్ వర్క్స్‌ను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఉస్మానియాలో కొత్త మార్చురీ నిర్మాణాన్ని తొమ్మిది నెలల్లో పూర్తిచేయాలని చెప్పారు.