హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్‌పై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. వెల్‌లోకి వచ్చినందుకే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. వెల్‌లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బీఏసీలో సీఎం చెప్పారని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి రాలేదు కాబట్టే వారిని సస్పెండ్ చేయలేదు అని స్పష్టం చేశారు. తమ స్థానంలో నిలబడి అడిగితేనే రాజ్యసభలో 12 మందిపై చర్యలు తీసుకున్నారు. ఢిల్లీకి ఒక న్యాయం.. రాష్ట్రానికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ స్పీచ్ సమయంలో వెల్‌లోకి సభ్యులు ఎవరూ రావొద్దనే అంశాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు.